నా సోదర ఖైదీల్లారా.. మీకు 5.11 కోట్లు దానం చేస్తా..
తన పుట్టినరోజు సందర్భంగా జైలులోని ఖైదీల కుటుంబాలకు డబ్బులు పంచి పెడతానంటూ లేఖ రాసిన సుకేష్.. పనిలో పనిగా బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కి కూడా ఓ లవ్ లెటర్ రాశాడు.
జైలులో ఉండే ఖైదీల్లో కొంతమంది పేదవాళ్లుంటారు, ఇంకొంతమంది ధనవంతులుంటారు. తీహార్ జైలు అంటే చెప్పక్కర్లేదు, వీఐపీ ఖైదీలకు అది పెట్టింది పేరు. తీహార్ జైలులో ఉన్న ఖైదీ ఒకరు తన తోటి ఖైదీల కుటుంబ సభ్యులకు 5 కోట్ల 11 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చాడు. జైలులో ఉన్న ఖైదీ సాయం ఎలా చేస్తాడని అనుకుంటున్నారా..? అతడికి బయట వందల కోట్ల ఆస్తులున్నాయి. అందులోనుంచి కొంత తన సహచర ఖైదీల కుటుంబాలకు ఇవ్వాలనుకున్నాడు. ఆ మేరకు అతడు మాట కూడా ఇచ్చేశాడు. అయితే బయట ఉన్న డబ్బుని ఖైదీల కుటుంబాలకు ఇవ్వడం ఎలా..? అందుకే జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ అనుమతి కోరారు. తన పేరిట బ్యాంకుల్లో ఉన్న డబ్బుని ఖైదీల కుటుంబాలకు పంచి పెడతాను, పర్మిషన్ ఇవ్వండి అని లేఖ రాశాడు.
ఎవరా ఖైదీ..?
తోటి ఖైదీల బాధలు చూడలేక, వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం చేస్తానంటున్న ఆ ఖైదీ పేరు కాన్ మన్ సుకేష్ చంద్రశేఖర్. బెంగళూరులో పెద్ద మోసగాడు. రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్ కు బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి వారి కుటుంబ సభ్యుల నుంచి 200 కోట్ల రూపాయలు వసూలు చేసిన కేసులో పోలీసులకు చిక్కాడు. 2021 సుకేష్ ని అరెస్ట్ చేసిన పోలీసులు తీహార్ జైలుకి తరలించారు. జైలులో ఉండి కూడా ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు ఆధారాలు దొరకడంతో ఈడీ దర్యాప్తు చేపట్టింది. బాలీవుడ్ హీరోయిన్లతో కూడా సుకేష్ కి మంచి పరిచయాలు ఉన్నట్టు తెలుస్తోంది.
తన పుట్టినరోజు సందర్భంగా జైలులోని ఖైదీల కుటుంబాలకు డబ్బులు పంచి పెడతానంటూ లేఖ రాసిన సుకేష్.. పనిలో పనిగా బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కి కూడా ఓ లవ్ లెటర్ రాశాడు. నా బేబీ జాక్వెలిన్, నా బర్త్ డే రోజు నేను నిన్ను మిస్ అవుతున్నా అంటూ లెటర్ రాశాడు. నా చుట్టు ఉన్న నీ ఎనర్జీని కోల్పోతున్నానంటూ లెటర్ లో పేర్కొన్నాడు. అన్నట్టు.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సుకేష్ దగ్గర ఖరీదైన గిఫ్ట్ లు తీసుకునేదని ఈడీ నిర్థారించింది కూడా. జాక్వెలిన్ కి చెందిన 7 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ 2022 ఏప్రిల్ లో అటాచ్ చేసింది.
ఓ ఖైదీ, తన ఆస్తిలో కొంత భాగాన్ని పంచిపెడతానని ముందుకు రావడం, అది కూడా జైలులో తన సహచర ఖైదీల కుటుంబ సభ్యులకు డబ్బులిస్తానని అనడం, దానికోసం అనుమతి కోరుతూ అధికారులకు లేఖ రాయడం సంచలనంగా మారింది.