రాహుల్ యాత్రలో భద్రతా వైఫల్యాలు.. సీఆర్పీఎఫ్ ప్రత్యారోపణలు
ఢిల్లీలో రాహుల్ పర్యటన భద్రత విషయంలో సీఆర్పీఎఫ్ వైఫల్యం చెందిందని, ఆ తర్వాత వచ్చే మరింత సున్నిత ప్రాంతాలైన పంజాబ్, జమ్మూ-కాశ్మీర్ లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని కాంగ్రెస్ కోరింది.
ఢిల్లీలో భారత్ జోడో యాత్ర జరిగిన సమయంలో రాహుల్ గాంధీ భద్రత విషయంలో వైఫల్యాలు కనిపించాయని కాంగ్రెస్ ఆరోపించింది. జడ్ ప్లస్ స్థాయి భద్రత ఉన్న వ్యక్తికి ఢిల్లీ పోలీసులు కనీస రక్షణను ఇవ్వలేకపోయారని విమర్శించింది. కాంగ్రెస్ నేరుగా సీఆర్పీఎఫ్ ని టార్గెట్ చేయడంతో అటువైపు నుంచి వివరణ వచ్చింది. రాహుల్ భద్రత విషయంలో మార్గదర్శకాలను పూర్తిగా పాటించామని సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ ప్రకటించింది. కానీ, రాహుల్ గాంధీ పదేపదే వాటిని ఉల్లంఘించారని పేర్కొంది.
రాహుల్ జనంలోకి వెళ్తున్నారు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తి సీఆర్పీఎఫ్ వలయాన్ని ఛేదించుకుని బయటకు వెళ్లకూడదని, కానీ పదే పదే రాహుల్ గాంధీ భద్రతా నియమాలు ఉల్లంఘించారని, సెక్యూరిటీ వలయాన్ని ఛేదించుకుని బయటకు వెళ్లారని సీఆర్పీఎఫ్ అధికారులు ఆరోపించారు. డిసెంబరు 24న ఢిల్లీలో యాత్ర సందర్భంగా రాహుల్‌కు భద్రత కల్పించే అంశంపై.. అంతకు రెండు రోజుల క్రితమే అదనపు భద్రతపై సమన్వయ సమావేశం నిర్వహించామన చెబుతున్నారు అధికారులు. అయితే చివరిగా రాహుల్ తమ మాట వినలేదని, భద్రతా నిబంధనలు ఉల్లంఘించారని అంటున్నారు. సంబంధిత వ్యక్తులు వారి రక్షణ కోసం రూపొందించిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉన్నప్పుడే.. ఫలితం ఉంటుందని చెప్పారు. 2020 నుంచి 113 సార్లు సెక్యూరిటీ ప్రొటోకాల్ ను రాహుల్ ఉల్లంఘించినట్లు తెలిపారు.
భద్రత పెంచాల్సిందే..
ఢిల్లీలో రాహుల్ పర్యటన భద్రత విషయంలో సీఆర్పీఎఫ్ వైఫల్యం చెందిందని, ఆ తర్వాత వచ్చే మరింత సున్నిత ప్రాంతాలైన పంజాబ్, జమ్మూ-కాశ్మీర్ లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని కాంగ్రెస్ కోరింది. రాహుల్ గాంధీ యాత్రలో, చుట్టూ ఉన్న జనాలను నియంత్రించే విషయంలో ఢిల్లీ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు కాంగ్రెస్ నేతలు. యాత్రలో రాహుల్ కు భద్రత పెంచాలంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ లేఖ రాశారు.