Telugu Global
National

కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ.. మధ్యలో కరోనా

ఈ దేశ ప్రజల బలానికి, నిజాలకు బీజేపీ భయపడుతోందన్నారు రాహుల్ గాంధీ. తన యాత్ర కాశ్మీర్‌ వరకు కొనసాగుతుందని తేల్చి చెప్పారు.

కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ.. మధ్యలో కరోనా
X

కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈసారి కొత్త వివాదానికి కారణం కరోనా. అవును, కరోనా పేరు చెప్పి భారత్ జోడో యాత్రను ఆపేయాలంటూ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ రాహుల్ గాంధీకి ఓ లేఖ రాశారు. కొవిడ్ జాగ్రత్తలు పాటించకపోతే యాత్ర ఆపేయాలంటూ ఆదేశించారు. దీనిపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు, రాహుల్ గాంధీ కూడా తీవ్రంగా స్పందించారు. హర్యానాలో యాత్ర కొనసాగిస్తున్న రాహుల్ గాంధీ, కేంద్రం నుంచి వచ్చిన లేఖపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ దేశ ప్రజల బలానికి, నిజాలకు బీజేపీ భయపడుతోందన్నారు. తన యాత్ర కాశ్మీర్‌ వరకు కొనసాగుతుందని తేల్చి చెప్పారు. కేంద్రం రాసిన లేఖలు, చెబుతున్న కొవిడ్ జాగ్రత్తలు తన యాత్రను ఆపేందుకు తెరపైకి తెచ్చిన సాకులు మాత్రమేనన్నారు.

కాంగ్రెస్‌ విమర్శలకు మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా తీవ్రంగా స్పందించారు. రాజకీయం కోసం లేఖ రాయలేదని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాశానని వివరించారు. తాను ఆరోగ్య మంత్రిని అని, ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం తనకు ఉందని, తనతోపాటు అన్ని పార్టీల నేతలకు, ప్రజలు కూడా ఆ బాధ్యత ఉందన్నారు. కరోనా వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ముగ్గురు ఎంపీలు తనకు లేఖలు రాశారని చెప్పారు మంత్రి.

జోడో యాత్రతో కరోనా వ్యాప్తి..

భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్న తర్వాత హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు వంటి కాంగ్రెస్‌ నేతలు కరోనా బారినపడ్డారని గుర్తు చేశారు ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ. ఇలాంటి ఉదాహరణలున్నా దీన్ని రాజకీయం అనడం భావ్యం కాదన్నారు. ప్రపంచ దేశాలన్నీ ముందు జాగ్రత్తలు తీసుకుంటుంటే, భారత్ లో మాత్రం ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయాలనుకోవడం సరికాదన్నారు. కొవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో ముందస్తు హెచ్చరికలు చేశామంటూ రాహుల్ గొప్పలు చెప్పుకునేవారని, ఇప్పుడు ఆముందు జాగ్రత్త ఏమైపోయిందని నిలదీశారు. ప్రస్తుతం కేంద్రం లేఖపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

First Published:  23 Dec 2022 6:56 AM IST
Next Story