జోడో యాత్ర ప్రభావంతోనే ప్రధాని మోడీ దక్షిణాది పర్యటనలు : కాంగ్రెస్
రాహుల్‌కు వస్తున్న ఈ ఆదరణను ఎలాంటి వ్యతిరేక శక్తులు కూడా ఆపలేవు అన్నారు. మోడీ పర్యటనలో ఫొటో షూట్ హడావుడి మినహా ఎలాంటి ప్రయోజనం ఉండదని ఎద్దేవా చేశారు.
భారత్ జోడో యాత్ర ద్వారా దక్షిణాదిలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరిగిందని, అందుకే ప్రధాని మోడీ వరుసగా దక్షిణ రాష్ట్రాల పర్యటనలు పెట్టుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ విమర్శించారు. రాహుల్ పాదయాత్ర ప్రభావంతోనే తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఏపీలో మోడీ పర్యటిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఆయన అన్నారు.
ప్రతీ రాష్ట్రంలో రాహుల్‌ను కలవాలని, ఆయనతో నడవాలని ఎంతో మంది కోరుకుంటున్నట్లు జైరాం రమేశ్ చెప్పారు. రాహుల్‌కు తమ సమస్యలు విన్నవిస్తూ.. కేంద్రం దృష్టికి తీసుకొని వెళ్లాలని కోరుతున్నారు. రాహుల్‌కు వస్తున్న ఈ ఆదరణను ఎలాంటి వ్యతిరేక శక్తులు కూడా ఆపలేవు అన్నారు. మోడీ పర్యటనలో ఫొటో షూట్ హడావుడి మినహా ఎలాంటి ప్రయోజనం ఉండదని ఎద్దేవా చేశారు.
కాగా, ప్రధాని మోడీ రెండు రోజల పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. శుక్రవారం చెన్నై-బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించారు. దక్షిణాదిలో ఇదే తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కావడం గమనార్హం. ఇక ఇవాళ, రేపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.
మరోవైపు రాహుల్ జోడో యాత్ర శుక్రవారం 65వ రోజుకు చేరుకున్నది. మహారాష్ట్రలో ఆయన పర్యటన కోసం అక్కడి పీసీసీ భారీ ఏర్పాట్లు చేసింది. కాంగ్రెస్ మిత్ర పక్ష పార్టీలు కూడా రాహుల్ వెంట నడుస్తున్నాయి. ఈ క్రమంలో శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే వర్గం) నాయకుడు ఆదిత్య ఠాక్రే జోడో యాత్రంలో రాహుల్‌ను కలిశారు. త్వరలోనే ఉద్ధవ్ ఠాక్రే కూడా జోడో యాత్రకు వస్తారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.