Telugu Global
National

మోదీ పేరు మార్చేస్తాం.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో వింత హామీ

తాము అధికారంలోకి వస్తే అహ్మదాబాద్ లో ఉన్న నరేంద్ర మోదీ స్టేడియం పేరు మార్చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఆ స్టేడియంకు సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే పేరు పెడతామని చెప్పింది.

మోదీ పేరు మార్చేస్తాం.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో వింత హామీ
X

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది. మహిళలు, వితంతువులు, వృద్ధులకు నెలకు రూ.2000 చొప్పున పింఛన్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తాము అధికారంలోకి రాగానే రాష్ట్రంలో 3 వేల ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చింది. బాలికలకు పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ వరకు ఫీజు లేకుండా చదువుకునే అవకాశం కల్పిస్తామని చెప్పింది. 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, అందులో 50శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తామని కూడా ప్రకటించింది. ఉద్యోగం లేనివారికి 3వేల నిరుద్యోగ భృతి, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనే హామీలు ఆకట్టుకునేలా ఉన్నాయి.

మోదీ పేరు మార్చేస్తాం..

అన్ని హామీలతోపాటు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన మరో హామీ మాత్రం కాస్త విచిత్రంగా ఉంది. తాము అధికారంలోకి వస్తే అహ్మదాబాద్ లో ఉన్న నరేంద్ర మోదీ స్టేడియం పేరు మార్చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఆ స్టేడియంకు సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే పేరు పెడతామని చెప్పింది. ఈ హామీ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో తెలియదు కానీ, బీజేపీ నేతలకు మాత్రం ఇప్పటినుంచే గుబులు మొదలైంది. మోదీ పేరు తీసేస్తారంటే వ్యతిరేకించొచ్చు, అదే సమయంలో పటేల్ పేరుని వ్యతిరేకిస్తే అది బీజేపీకే మంచిది కాదనేది కాంగ్రెస్ ఆలోచన.

గుజరాత్ పరిస్థితి ఏంటి..?

గుజరాత్ లో బీజేపీ విజయ పరంపరకు ఎలాగైనా గండి కొట్టాలని చూస్తున్నాయి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ. దేశవ్యాప్తంగా బీజేపీపై పెరుగుతున్న వ్యతిరేకత తమకు కలిసొస్తుందని అనుకుంటోంది కాంగ్రెస్. అటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గుజరాత్ లో చరిత్ర సృష్టిస్తామంటోంది. పంజాబ్ లాగే గుజరాత్ ని కూడా సాధించేందుకు కేజ్రీవాల్ గట్టిగా కృషి చేస్తున్నారు. గుజరాత్‌ లో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. డిసెంబర్ 8న గుజరాత్ ఫలితం విడుదలవుతుంది.

First Published:  13 Nov 2022 3:51 AM GMT
Next Story