Telugu Global
National

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు: త్రిపాఠి నామినేషన్ తిరస్కర‌ణ‌, బ‌రిలో వారిద్ద‌రే

కాంగ్రెస్ అధ్యక్ష‌పదవికి వచ్చిన నామినేషన్లలో జార్ఖండ్ మాజీ మంత్రి కెఎన్ త్రిపాఠి దాఖ‌లు చేసిన నామినేషన్ ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దాంతో మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, శ‌శిథ‌రూర్ లు మాత్రమే రంగంలో ఉన్నారు.

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు: త్రిపాఠి నామినేషన్ తిరస్కర‌ణ‌, బ‌రిలో వారిద్ద‌రే
X

కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి జార్ఖండ్ మాజీ మంత్రి కెఎన్ త్రిపాఠి దాఖ‌లు చేసిన నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ‌కు గురైంది. ఎన్నిక‌ల అధికారులు శనివారం నాడు నామినేష‌న్ల ప‌రిశీల‌న త‌ర్వాత ఆయన తిరస్క‌రిస్తున్న‌ట్టు తెలిపారు. దీంతో త్రిముఖ‌ పోటీ అనుకున్నా చివ‌రికి ద్విముఖ‌ పోటీగా మారింది. నామినేష‌న్ల ప‌రిశీల‌న త‌ర్వాత‌ సీనియ‌ర్ నేత మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, తిరువ‌నంత పురం ఎంపీ శ‌శిథ‌రూర్ పోటీలో ఉన్నారు.

ఏఐసీసీ సెంట్రల్‌ ఎలక్షన్‌ అథారిటీ చైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీ కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నామినేషన్‌ ప్రక్రియలో మొత్తం 20 ఫారాలు వచ్చాయని, వాటిలో నాలుగు తిరస్కరణకు గురయ్యాయని తెలిపారు. ఖర్గే 14 ఫారంలు సమర్పించగా, థరూర్ ఐదు, త్రిపాఠి ఒకటి సమర్పించారని చెప్పారు. త్రిపాఠి ప్రతిపాదకుల‌లో ఒకరి సంతకం సరిపోలకపోవడంతో అతని ఫారంను తిరస్కరించామని, మరో ప్రపోజర్ సంతకం రెండు సార్లు వ‌చ్చిందని మిస్త్రీ చెప్పారు.

ఈ ప‌దవి కోసం జరిగే పోటీలో గాంధీకుటుంబీకులు ఎవ‌రూ లేక‌పోయిన‌ప్ప‌టికీ త‌మ కుటుంబానికి,పార్టీకి వీర విధేయుడైన‌ ఖ‌ర్గే అభ్య‌ర్ధిత్వానికి తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియాగాంధీ ఆమోదం తెలిపారు.

ఖ‌ర్గే వ్య‌క్తిత్వంతోపాటు సోనియా గాంథీ ఆమోదం కూడాఉండ‌డంతో ఆయ‌న ఎన్నిక ఖాయ‌మైన‌ట్టేన‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇదే సంద‌ర్భంలో ఖ‌ర్గే రాజ్య‌స‌భ‌లో త‌న విప‌క్ష నేత ప‌ద‌వికి రాజీనామా చేసి పార్టీ నేత‌ల అభిమానాన్ని చూర‌గొని మంచి మార్కులు కొట్టేశారు. అస‌లు జోడు ప‌ద‌వుల వివాద‌మే కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌ల‌ను ఎన్నో మ‌లుపులు తిప్పిన విష‌యం తెలిసిందే. ఓటింగ్ ప్రక్రియ అక్టోబర్ 17న జరగనుండగా, పార్టీ కొత్త అధినేతను అక్టోబర్ 19న ప్రకటించనున్నారు.

First Published:  1 Oct 2022 2:08 PM GMT
Next Story