Telugu Global
National

అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక.. రాహుల్ పై ఆజాద్ విమర్శల ప్రభావం ఉంటుందా..?

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి మహూర్తం ఖరారైంది. అక్టోబర్ 17న ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు తెలిపారు.

అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక.. రాహుల్ పై ఆజాద్ విమర్శల ప్రభావం ఉంటుందా..?
X

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి మహూర్తం ఖరారైంది. అక్టోబర్ 17న ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు తెలిపారు. ఈమేరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లిన ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమెకు తోడుగా వెళ్లిన రాహుల్‌, ప్రియాంక కూడా వర్చువల్‌ సీడబ్ల్యూసీ మీటింగ్ లో పాల్గొన్నారు. అధ్యక్ష ఎన్నికకు సంబంధించి సెప్టెంబర్ 22న నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్టు తెలిపారు.

ఎందుకీ హడావిడి..

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలనేవి పూర్తిగా ఆ పార్టీ అంతర్గత వ్యవహారం కానీ గత కొన్నేళ్లుగా ఈ విషయం పార్టీకే పెద్ద సమస్యగా మారింది. పార్టీ వరుస పరాజయాలను ఎదుర్కోవడం పక్కనపెడితే, అధ్యక్ష పదవి తీసుకోడానికి రాహుల్ గాంధీ ముందుకు రావడంలేదు. పోనీ ప్రియాంక గాంధీకి ఇద్దామన్నా.. ఆమె అంత పెద్ద బాధ్యత మోయగలరా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. సోనియా ఆరోగ్యం బాగోలేదు, రాహుల్ కి ఇష్టంలేదు, గాంధీ కుటుంబానికి సంబంధంలేని వారికి పగ్గాలప్పగించాలంటే రబ్బర్ స్టాంప్ ముద్ర వేస్తారనే ఉద్దేశంతో ఎవరూ ముందుకు రావట్లేదు. ఈలోపు జి-23 నాయకుల విసుర్లు, కసుర్లు.. ఇలా సాగుతోందీ వ్యవహారం. తాజాగా గులాంనబీ ఆజాద్ రాజీనామాతో కాంగ్రెస్ వ్యవహారం మరింత హాట్ హాట్ గా మారింది. ఆజాద్ వెళ్తూ, వెళ్తూ రాహుల్ పై అసమర్థుడు అనే ముద్రవేశారు. దీంతో అధ్యక్ష ఎన్నిక అనేది మరింత ఆసక్తిగరంగా మారింది.

71 ఏళ్ల అశోక్ గెహ్లాత్ ని కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసి అధినేత సోనియా రిస్క్ చేయగలరా..? ఇప్పటికే కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని మమతా బెనర్జీ, కేజ్రీవాల్ వంటివారు ప్రయత్నిస్తున్నారు. మరికొన్ని జాతీయ పార్టీలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. ఈ దశలో ప్రతిపక్షాలను ఏకం చేయాలంటే ముందు ఆ ప్రతిపక్షాల్లో ప్రధాన పక్షంగా కాంగ్రెస్ నెగ్గుకు రావాలి. వాటికంటే ఎక్కువగా చెప్పుకోదగ్గ స్థాయిలో లోక్ సభ సీట్లు నెగ్గాలి. కానీ పరిస్థితి అంత సానుకూలంగా లేదు. బీజేపీకి వ్యతిరేకంగా ఎక్కడికక్కడ స్థానిక పార్టీలు బలపడిపోతున్నాయి. ఈ దశలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఓ ఆశాకిరణం మాత్రమే. ఉత్సాహంగా యాత్రలు చేస్తానంటున్న రాహుల్ అదే హుషారుతో పార్టీ అధ్యక్ష పదవి చేపట్టమంటే మాత్రం కుదరదు పొమ్మంటున్నారు. కనీసం ఆజాద్ విమర్శలతో అయినా రాహుల్ లో చురుకుపుడుతుందా, పగ్గాలు చేపట్టి ఎన్నికల రణ క్షేత్రంలో సత్తా చూపించడానికి సిద్ధమవుతారా..? లేక బేలగా నాకీ ముళ్లకిరీటం వద్దని వెనుక వరుసలోకి వెళ్తారా..? వేచి చూడాలి.

First Published:  28 Aug 2022 5:47 PM IST
Next Story