38 పార్టీలా.. అవి రిజిస్టర్ అయినవేనా..? - ఖర్గే ఎద్దేవా
ఢిల్లీలో జరుగుతున్న ఎన్డీఏ సమావేశానికి 38 పార్టీలు వస్తున్నాయని అంటున్నారని.. కానీ అవి రిజస్టర్ అయినవేనా..? అంటూ ఎద్దేవా చేశారు.
బెంగళూరులో రెండు రోజులపాటు జరిగిన విపక్షాల భేటీకి 26 పార్టీల నేతలు హాజరవ్వగా, మంగళవారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన ఎన్‌డీఏ భేటీకి 38 పార్టీల నేతలు హాజరవుతున్నారని ఎన్‌డీఏ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందిస్తూ.. ఢిల్లీలో జరుగుతున్న ఎన్డీఏ సమావేశానికి 38 పార్టీలు వస్తున్నాయని అంటున్నారని.. కానీ అవి రిజస్టర్ అయినవేనా..? అంటూ ఎద్దేవా చేశారు.
ప్రతిపక్ష పార్టీలంటే ప్రధాని మోదీకి భయమని ఖర్గే చెప్పారు. మహాకూటమికి ఇండియన్ నేషనల్ డెమొక్రటిక్ ఇంక్లూజివ్ అలయెన్స్ (ఇండియా) అనే పేరు సూచించామని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతిపక్ష పార్టీల కూటమిని సమన్వయ పరచడానికి 11 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్టు ఖర్గే వెల్లడించారు. తదుపరి కార్యాచరణపై చర్చించడానికి ముంబైలో తదుపరి సమావేశం నిర్వహించనున్నామని తెలిపారు.
పాట్నాలో జరిగిన విపక్షాల సమావేశానికి 16 పార్టీలు హాజరైతే.. తాజాగా బెంగళూరులో జరిగిన భేటీకి 26 వచ్చాయని అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో కూటమి పార్టీల మధ్య విభేదాలున్నా వాటిని పక్కన పెట్టాలని నిర్ణయించామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.