Telugu Global
National

కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌లు: తెర‌పైకి కొత్త పేర్లు..రాహుల్ గాంధీ ఛాయిస్ ఆయ‌నేన‌ట‌ !

కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక గందరగోళంగా తయారయ్యింది. అశోక్ గెహ్లాట్ ను అధ్యక్షుణ్ణి చేద్దామనుకున్న సోనియా గాంధీ ఆలోచనకు గండి కొట్టారాయన. ఇప్పుడు అధ్యక్ష బరిలో మరి కొన్ని కొత్త పేర్లు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌లు: తెర‌పైకి కొత్త పేర్లు..రాహుల్ గాంధీ ఛాయిస్ ఆయ‌నేన‌ట‌ !
X

రాజ‌స్థాన్ లో రాజ‌కీయ సంక్షోభం త‌ర్వాత అధ్య‌క్ష ప‌ద‌వికి త‌గిన అభ్య‌ర్ధి కోసం కాంగ్రెస్ పార్టీ త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతోంది. విధేయుడ‌నుకున్న గెహ్లాట్ అస‌మ్మ‌తిని, తిరుగుబాటును రెచ్చ‌గొట్టిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వ‌డంతో అధిష్టానం ఖంగు తిన్న‌ది. దీంతో ఆచితూచి ఆలోచిస్తోంది. అగ్ర‌నేత రాహుల్ గాంధీ, సోనియా ఇత‌ర సీనియ‌ర్ నాయ‌కుల‌తో అభ్య‌ర్ధి విష‌య‌మై చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. తెర‌పైకి కొత్త పేర్లు వ‌స్తున్నాయి.

కుమారి సెల్జా పేరును అత్యున్నత పదవికి పరిగణించే అవకాశం ఉందని వినిపిస్తోంది. అయితే రాహుల్ గాంధీ మాత్రం కేసీ వేణుగోపాల్ పేరు కు మొగ్గు చూపుతున్నార‌ని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విష‌య‌మై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. సోమవారం సోనియా గాంధీని కలిసిన కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్.. తనకు పార్టీ అధ్యక్షుడవ్వడం ఇష్టం లేదని, మధ్యప్రదేశ్‌లో పార్టీ కోసం నిరంతరం పనిచేయాలనుకుంటున్నట్లు చెప్పారు. గెహ్లాట్ ఉదంతం త‌ర్వాత క‌మ‌ల‌నాథ్ నామినేష‌ఫ‌న్ దాఖ‌లు చేస్తార‌ని గ‌ట్టిగా వినిపించిన విష‌యం తెలిసిందే.

మల్లికార్జున్ ఖర్గే, భూపేష్ బాఘేల్, ముకుల్ వాస్నిక్ వంటి ఇతర పేర్లను పరిశీలిస్తున్నప్పటికీ, వారిలో ఎవరూ ఇప్పటివరకు కాంగ్రెస్ తరపున అధ్యక్ష పదవికి నామినేషన్ ప‌త్రాలు కూడా తీసుకోలేదు. వారు పెద్ద‌గా పార్టీ ప‌ద‌విపై ఆస‌క్తి చూపిస్తున్న‌ట్టు అనిపించ‌డంలేదు.

ఇప్ప‌టికైతే వారిద్ద‌రే !

ఇప్ప‌టికైతే ఎంపీ శశి థరూర్ ,కాంగ్రెస్ పార్టీ కోశాధికారి పవన్ కుమార్ బన్సాల్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బ‌రిలో అభ్యర్థులుగా నిలిచే అవకాశం ఉంది. ఈ ఏడాది కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేస్తారని భావించిన పార్టీ సీనియర్ సభ్యులలో ఇప్ప‌టివ‌ర‌కు కేవలం వీరు ఇద్దరు మాత్రమే నామినేష‌ఫ‌న్ ఫారమ్‌లను తీసుకున్నారు. అయితే బ‌న్సాల్ నామినేష‌న్ ప‌త్రాలు దాఖ‌లు చేస్తారా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు. అశోక్ గెహ్లాట్ స్వ‌యంకృతాప‌రాధంతో చ‌రిత్ర క‌లిగిన ఓ జాతీయ పార్టీ కి అధ్య‌క్షుడ‌య్యే అవ‌కాశాన్ని కోల్పోయారు. రాజస్థాన్‌లోని రాజకీయ నాటకం కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్లాన్ బి గురించి ఆలోచించేలా చేసింది.

పార్టీ అత్యున్నత పదవికి పోటీలో ఉన్నవారి పేర్లను ధృవీకరిస్తూ, పార్టీ కేంద్ర ఎన్నిక‌ల అథారిటీ ఛైర్మన్ మధుసూదన్ మిస్త్రీ, "ఇప్పటి వరకు థరూర్, పవన్ బన్సాల్ నామినేషన్ ఫారమ్‌లను తీసుకున్నారు" అని అన్నారు.

First Published:  27 Sept 2022 6:04 PM IST
Next Story