Telugu Global
National

కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌లు..దిగ్విజ‌య్ సింగ్ ట్విస్ట్‌!

కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి జరగబోయే ఎన్నికల్లో తానూ పోటీలో ఉన్నట్టు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ తెలిపారు. పోటీలో గాంధీలు లేరంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా ఆయ‌న అన్నారు.

కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌లు..దిగ్విజ‌య్ సింగ్ ట్విస్ట్‌!
X

కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి ఎన్నిక‌లు అనివార్య‌మ‌నే ప‌రిస్థితుల్లో మ‌రో సీనియ‌ర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజ‌య్ సింగ్ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. పార్టీలో ఈ అత్యున్న‌త ప‌ద‌వికి తాను కూడా పోటీలో దిగ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. ఇప్ప‌టికే రేసులో అశోక్ గెహ్లాట్. శ‌శిథ‌రూర్ ముందువ‌ర‌స‌లో ఉండ‌గా దిగ్విజ‌య్ కూడా వారి వ‌ర‌స‌లో చేరారు. బుధ‌వారంనాడు ఆయ‌న ఓ ఆంగ్ల వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు విష‌యాలు చెప్పారు.

ఎవరు అధ్యక్షుడవుతారు ? అశోక్ గెహ్లాటా శశి థరూరా అని దిగ్విజయ్ ని అడుగగా "చూద్దాం. నేనూ పోటీలో ఉంటాను. న‌న్నెందుకు మీరు ప‌రిగ‌ణించ‌డంలేదు?" అన్నారు దిగ్విజయ్. పోటీ చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది.. 30వ తేదీ సాయంత్రం (నామినేషన్ల చివరి రోజు) మీకు సమాధానం దొరుకుతుంది." అన్నారు.

రేసులో గాంధీ లేరంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా ఆయ‌న అన్నారు. "అస్స‌లు ఆందోళన చెందాల్సిన అవ‌స‌రం లేదు. పోటీ చేయాలనుకునే వారంద‌రికీ పోటీలో నిలిచే హక్కు ఉంటుంది. ఒకరు పోటీ చేయకూడదనుకుంటే, పోటీ చేయాల‌ని ఎవ్వరూ బలవంతం చేయలేరు. " అని ఆయన అన్నారు.

"2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం తర్వాత తాను రాజీనామా చేసిన పదవిని తిరిగి చేప‌ట్ట‌డానికి రాహుల్ గాంధీ నిరాకరించారు. రాహుల్ గాంధీని ఒప్పించ‌లేక‌పోతే మాత్రం పోటీ చేస్తానని అశోక్ గెహ్లాట్ చెప్పారు. ప్ర‌తి వాళ్ళూ వాస్త‌వ ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించాలి. ఏమ‌వుతుందో చూద్దాం. అయితే రాహుల్ గాంధీ తన మనస్సును ఒకసారి మార్చుకుంటే, దానిని మ‌ళ్ళీ మార్చడం కష్టం." అని దిగ్విజయ్ అన్నారు.

గతంలో గాంధీ కుటుంబేతర వ్యక్తి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పని చేసిందని ఆయన గుర్తు చేశారు. గ‌తంలో పి.వి. నరసింహారావు, సీతారాం కేస‌రి ఉన్నప్పుడు కూడా మేం ప‌ని చేశాం క‌దా అని అన్నారు. ఒక వేళ రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా పోటీ చేయక‌పోతే, కాంగ్రెస్ కు కొత్తగా ఎన్నికైన‌ అధ్యక్షుడు ఏ బాధ్య‌త‌ల‌ను అప్పగించినా రాహుల్ వాటిని నెర‌వేరుస్తాడ‌ని దిగ్విజ‌య్ అన్నారు.

First Published:  21 Sept 2022 9:06 PM IST
Next Story