Telugu Global
National

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ విలవిల

ఒకే ఒక్క స్థానంలో రెండో ప్లేస్‌లో.. భారీ సంఖ్యలో డిపాజిట్లు గల్లంతు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ విలవిల
X

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ విలవిల్లాడింది. వరుసగా మూడోసారి ఒక్కటంటే ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. ఘోర పరాజయాల్లో హ్యాట్రిక్‌ నమోదు చేసింది. షీలా దీక్షిత్‌ నాయకత్వంలో వరుసగా మూడుసార్లు విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు పరాజయాల్లోనూ వరుసగా మూడుసార్లు ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది. ప్రస్తుత ఎన్నికల్లో 6.35 శాతం ఓట్‌ షేర్‌తో 6,01,804 ఓట్లు మాత్రమే సాధించింది. ఒక్క కస్తూర్బా నగర్‌ నియోజకవర్గంలో మాత్రమే కాంగ్రెస్‌ అభ్యర్థి అభిషేక్‌ దత్‌ రెండో స్థానంలో నిలిచారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి నీరజ్‌ బసోయా 38,067 ఓట్లు సాధించగా అభిషేక్‌ కు 27,019 ఓట్లు పోలయ్యాయి.. 11,048 ఓట్ల తేడాతో అభిషేక్‌ ఓడిపోయారు. ఢిల్లీ పీసీసీ చీఫ్‌ దేవేందర్‌ యాదవ్‌, కీలకనేత రోహిత్‌ చౌదరికి మాత్రమే గౌరవ ప్రదమైన ఓట్లు వచ్చాయి. ఈ ముగ్గురు నేతలు మినహా ఇంకో 15 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు మాత్రమే 10 వేల కన్నా ఎక్కువ ఓట్లు సాధించారు. మాజీ సీఎం షీలా దీక్షిత్‌ కుమారుడు సందీప్‌ దీక్షిత్‌, కీలక నేత అల్కలాంబ సహా మిగిలిన అభ్యర్థులంతా డిపాజిట్లు కోల్పోయారు.

  • బద్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఆహిర్‌ దీప్‌ చౌదరి 61,192 ఓట్లు రాగా ఆప్‌ అభ్యర్థి అజేశ్‌ యాదవ్‌ కు 46,029 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి దేవేందర్‌ యాదవ్‌ కు 41,071 ఓట్లు పోలయ్యాయి.
  • నాంగ్లొయ్‌ జాట్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మజోన్‌ కుమార్‌ షోకేన్‌ కు 75,272 ఓట్లు రాగా, ఆప్‌ అభ్యర్థి రఘువీందర్‌ షోకేన్‌ కు 49,021 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి రోహిత్‌ చౌదరికి 32,028 ఓట్లు పోలయ్యాయి.
  • బల్లిమారన్‌ నియోజకవర్గంలో ఆప్‌ అభ్యర్థి ఇమ్రాన్‌ హుస్సేన్‌ 57,004 ఓట్లు, బీజేపీ అభ్యర్థి కమల్‌ బాగ్రికి 27,181 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి హర్నూన్‌ యుసుఫ్‌ కు 13,059 ఓట్లు వచ్చాయి.
  • బవానాలో బీజేపీ అభ్యర్థి 1,19,515 ఓట్లు, ఆప్‌ అభ్యర్థి జై భగవాన్‌ ఉపకార్‌ కు 88,040 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి సురేందర్‌ కుమార్‌ కు 18,713 ఓట్లు పోలయ్యాయి.
  • బురారిలో ఆప్‌ అభ్యర్థి సంజీవ్‌ జాకు 1,21,181 ఓట్లు, జేడీ (యూ) అభ్యర్థి శైలేంద్ర కుమార్‌ కు 1,00,580 ఓట్లు రాగా కాంగ్రెస్‌ అభ్యర్థి మంగేశ్‌ త్యాగికి 19,920 ఓట్లు వచ్చాయి.
  • డియోలిలో ఆప్‌ అభ్యర్థి ప్రేమ్‌ చౌహాన్‌ కు 86,889 ఓట్లు, లోక్‌జనశక్తి (రాం విలాస్‌) అభ్యర్థి దీపక్‌ తన్వర్‌ కు 50,209 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి రాజేశ్ చౌహాన్‌ కు 12,211 ఓట్లు పోలయ్యాయి.
  • మాదిపూర్‌లో బీజేపీ అభ్యర్థి కైలాష్‌ గంగ్వాల్‌కు 52,019 ఓట్లు, ఆప్‌ అభ్యర్థి రాఖీ బిర్లాకు 41,120 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి జేపీ పన్వర్‌కు 17,958 ఓట్లు పోలయ్యాయి.
  • మతియ మహల్‌ నియోజకవర్గంలో ఆప్‌ అభ్యర్థి అలే మహ్మద్‌ ఇక్బాల్‌ కు 58,120 ఓట్లు, బీజేపీ అభ్యర్థి దీప్తి ఇందోరాకు 15,396 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి ఆసిం మహ్మద్‌ కు 10,295 ఓట్లు పోలయ్యాయి.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 42,724 ఓట్ల అత్యధిక మెజార్టీతో ఈ స్థానంలో ఆప్‌ అభ్యర్థి విజయం సాధించారు.
  • మెహ్రౌలి నియోజకవర్గంలో ఇండిపెండెంట్‌ మూడో స్థానంలో నిలిస్తే కాంగ్రెస్‌ అభ్యర్థి నాలుగో స్థానానికి పరిమితయ్యారు.
  • ముస్తఫాబాద్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మోహన్‌ సింగ్‌ బిస్త్‌ 17,578 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక్కడ మోహన్‌ సింగ్‌ కు 85,215 ఓట్లు, ఆప్‌ అభ్యర్థి ఆదిల్‌ అహ్మద్‌ ఖాన్‌ కు 67,637 ఓట్లు, ఎంఐఎం అభ్యర్థి, ఢిల్లీ అల్లర్ల కేసులో విచారణ ఎదుర్కొంటున్న మహ్మద్‌ తాహిర్‌ హుస్సేన్‌ కు 33,474 ఓట్లు వచ్చాయి. నాలుగో స్థానంలో ఉన్న కాంగ్రెస్‌ అలీ మెహదీకి 11,763 ఓట్లు వచ్చాయి. ముస్లిం ఓటర్లు 50 శాతం వరకు ఉన్న ఈ నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీలు ముస్లిం అభ్యర్థిని నిలబెట్టగా బీజేపీ తరపున పోటీ చేసిన హిందూ అభ్యర్థి ఇక్కడి నుంచి విజయం సాధించారు.
  • ముండ్కా అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గజేందర్‌ ద్రాల్‌ కు 89,839 ఓట్లు రాగా, ఆప్‌ అభ్యర్థి జస్బీర్‌ కరాలాకు 79,289 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి ధర్మపాల్‌ లక్రాకు 10,290 ఓట్లు పోలయ్యాయి.
  • ఓక్లా నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి అమానుల్లా ఖాన్‌ కు 88,943 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి మనీశ్‌ చౌదరికి 65,304 ఓట్లు, ఎంఐఎం అభ్యర్థి షిఫా ఉర్‌ రహమాన్‌ ఖాన్‌ కు 39,558 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి అరిబా ఖాన్‌ కు 12,739 ఓట్లతో నాలుగో స్థానంలో నిలిచారు.
  • పత్పర్‌ గంజ్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రవీందర్‌ సింగ్‌ నేగికి 74,060 ఓట్లు, ఆప్‌ అభ్యర్థి అవధ్‌ ఓజాకు 45,988 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి అనిల్‌ కుమార్‌ కు 16,549 ఓట్లు పోలయ్యాయి.
  • సదర్‌ బజార్‌ నియోజకవర్గంలో ఆప్‌ అభ్యర్థి సోమ్‌ దత్‌ కు 56,177 ఓట్లు, బీజేపీ అభ్యర్థి మనోజ్‌ కుమార్‌ జిందాల్‌ కు 49,870 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి అనిల్‌ భరద్వాజ్‌ కు 10,057 ఓట్లు పోలయ్యాయి.
  • సంగమ్‌ విహార్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి చందన్‌ కుమార్‌ చౌదరి ఆప్‌ అభ్యర్థిపై 344 ఓట్ల తేడాతో విజయం సాధించారు. చందన్‌ కుమార్‌ కు 54,049 ఓట్లు రాగా, ఆప్‌ అభ్యర్థి దినేశ్‌ మోహనియాకు 53,705 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి హరీశ్‌ చౌదరికి 15,863 ఓట్లు పోలయ్యాయి.
  • సీలంపూర్‌ నియోజకవర్గంలో ఆప్‌ అభ్యర్థి చౌదరి జుబేర్‌ అహ్మద్‌ బీజేపీ అభ్యర్థిపై 42,477 ఓట్ల ఆదిక్యంతో విజయం సాధించి అత్యధిక మెజార్టీలో రెండోస్థానంలో నిలిచారు. జుబేర్‌ అహ్మద్‌ కు 79,009 ఓట్లు పోల్‌ కాగా, బీజేపీ అభ్యర్థి అనిల్‌ కుమార్‌ శర్మకు 36,532 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి అబ్దుల్‌ రహమాన్‌ కు 16,551 ఓట్లు వచ్చాయి.
  • సీమాపురి నియోజకవర్గంలో ఆప్‌ అభ్యర్థి వీర్‌సింగ్‌ దిహంగన్‌ కు 66,353 ఓట్లు, బీజేపీ అభ్యర్థి కేయూ రింకూకు 55,985 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి రాజేశ్‌ లిలోతియాకు 11,823 ఓట్లు పోలయ్యాయి.
  • ఉత్తమ్‌ నగర్‌ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పవన్‌ శర్మకు 1,03,613 ఓట్లు, ఆప్‌ అభ్యర్థి పోష్‌ బల్యాన్‌కు 73,873 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి ముకేశ్‌ శర్మకు 15,565 ఓట్లు పోలయ్యాయి.
  • త్రిలోక్‌పురి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రవికాంత్‌ ఆప్‌ అభ్యర్థి అంజనా రిచాపై 392 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థికి ఆరు వేల ఓట్లు పోలయ్యాయి.
First Published:  8 Feb 2025 7:08 PM IST
Next Story