ఎగ్జిట్ పోల్స్‌పై చర్చల్లో మేం పాల్గొనబోం.. - కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా
చర్చ ద్వారా ఏదో ఒక కచ్చితమైన విషయాన్ని ప్రజలకు చేరవేయాలి. అందుకే జూన్ 4 తర్వాత జరిగే చర్చల్లో కాంగ్రెస్ పాల్గొంటుంది‘ అని వివరించారు.
సార్వత్రిక ఎన్నికల పోరు తుది దశకు చేరుకుంది. జూన్ ఒకటో తేదీ శనివారం నాడు చివరి దశ పోలింగ్ జరగనుంది. దీంతో శనివారం సాయంత్రం ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడి కానున్నాయి. ఇక వివిధ టీవీ ఛానళ్లు ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలపై గంటల తరబడి చర్చా కార్యక్రమాలు నిర్వహించే విషయం తెలిసిందే. అయితే.. కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎగ్జిట్ పోల్స్‌పై టీవీ ఛానళ్లు నిర్వహించే చర్చా కార్యక్రమాల్లో పాల్గొనకూడదని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధికార ప్రతినిధి, మీడియా వ్యవహారాల చైర్‌పర్సన్ పవన్ ఖేరా శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టు ద్వారా వెల్లడించారు.
పవన్ ఖేరా తన పోస్టులో ‘ఎగ్జిట్ పోల్స్‌పై చర్చా కార్యక్రమాల్లో కాంగ్రెస్ పాల్గొనబోదు. చర్చ ద్వారా ఏదో ఒక కచ్చితమైన విషయాన్ని ప్రజలకు చేరవేయాలి. అందుకే జూన్ 4 తర్వాత జరిగే చర్చల్లో కాంగ్రెస్ పాల్గొంటుంది‘ అని వివరించారు. పోలింగ్ ముగిసేసరికి ప్రజలంతా ఓటుహక్కుతో తమ నాయకులను ఎన్నుకొని ఉంటారని, వారి నిర్ణయం ఈవీఎంలలో భద్రంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఎన్ని చర్చలు పెట్టినా ఆ నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరని, అలాంటప్పుడు టీఆర్పీ రేటింగ్ కోసం ఊహాగానాలను ప్రచారం చేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. జూన్ 4న విడుదలయ్యే ఫలితాల్లో విజయం ఎవరిదో తేలుతుందని, ఆ తర్వాత జరిగే చర్చల్లో కాంగ్రెస్ పాల్గొంటుందని ఆయన వివరించారు.
కాంగ్రెస్ నిర్ణయంపై బీజేపీ ఎద్దేవా
లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ చర్చల్లో పాల్గొనకూడదని కాంగ్రెస్ చేసిన ప్రకటనపై బీజేపీ స్పందిస్తూ ఆ పార్టీకి కౌంటర్ ఇచ్చింది. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ద్వారా తన ఓటమిని అంగీకరించినట్టేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ‘ఎక్స్’ద్వారా స్పందిస్తూ ఎద్దేవా చేశారు. శనివారం జరగనున్న చివరి దశ పోలింగులో తమ ఓటును వృథా చేసుకోవద్దని ఈ సందర్భంగా ఓటర్లను కోరారు. తనకు అనుకూలమైన ఫలితాలు రాని సందర్భంలో కాంగ్రెస్ ముందుగానే వైదొలగడం సాధారణమేనని ఆయన చెప్పారు. ఎన్నికల్లో గెలిచినప్పుడు ఈవీఎంలపై, ఎన్నికల ప్రక్రియపై హస్తం పార్టీ ఎలాంటి ఫిర్యాదులు చేయదని, ఓడిపోయినప్పుడు మాత్రం ఆరోపణలు చేస్తుందని విమర్శించారు.