Telugu Global
National

కాంగ్రెస్ నాలుగో హామీ.. నిరుద్యోగులకు 3వేల భృతి

డిగ్రీ చదివి ఉద్యోగం లేనివారికి నెలకు 3వేల రూపాయలు, డిప్లొమా చదివి ఉద్యోగం రానివారికి నెలకు 1500 రూపాయలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్నారు. యువతకు ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలిస్తామని ప్రకటించారాయన.

కాంగ్రెస్ నాలుగో హామీ.. నిరుద్యోగులకు 3వేల భృతి
X

జోడో యాత్రతో ఊపుమీదున్న కాంగ్రెస్ ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన కర్నాటకలో పాగా వేసేందుకు అడుగులు వడివడిగా వేస్తోంది. ఇప్పటికే అక్కడి కమీషన్ రాజ్ సర్కార్ పూర్తిగా ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంది. అప్రజాస్వామికంగా అక్కడ అధికారం చేపట్టిన బీజేపీ, దాన్ని నిలబెట్టుకునే క్రమంలో నానా తంటాలు పడుతోంది. ముఖ్యమంత్రుల్ని మార్చింది, జనాల్ని ఏమార్చాలని చూసింది. కానీ బయటపడుతున్న అవినీతి, అక్రమాలు ఆ పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదని తేల్చేశాయి. ఈ దశలో కాంగ్రెస్ దూకుడుమీద ఉంది. రాహుల్ గాంధీ కర్నాటకలో పర్యటిస్తూ ప్రజల్ని ఆకర్షించే పథకాలు ప్రకటిస్తున్నారు.

నిరుద్యోగులకు 3వేల భృతి..

కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు భృతి ఇస్తామని ప్రకటించారు రాహుల్ గాంధీ. డిగ్రీ చదివి ఉద్యోగం లేనివారికి నెలకు 3వేల రూపాయలు, డిప్లొమా చదివి ఉద్యోగం రానివారికి నెలకు 1500 రూపాయలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్నారు. యువతకు ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలిస్తామని ప్రకటించారాయన. ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. బెళగావిలో ‘యువక్రాంతి’ బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ యువతను ఆకట్టుకునేలా ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమని అన్నారు.


ఇది నాలుగో హామీ..

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇప్పటికే అక్కడి ప్రజలకు వరుస హామీలిస్తోంది కాంగ్రెస్ పార్టీ. నివాస గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళ ఇంటిపెద్దగా ఉన్న కుటుంబానికి నెలకు రూ.2,000 ఆర్థికసాయం, పేద కుటుంబాల్లో ప్రతి సభ్యుడికి నెలకు 10 కేజీల ఉచిత బియ్యం ఇస్తామని హామీలిచ్చింది. ఇప్పుడు నాలుగో హామీగా నిరుద్యోగ భృతిని ప్రకటించారు రాహుల్ గాంధీ.

దేశం ఒకరిద్దరి సొత్తు కాదని, అదానీది అస్సలు కాదని అన్నారు రాహుల్ గాంధీ. కానీ బీజేపీ స్నేహితులైన కొద్దిమందికే దేశంలో అన్నీ దక్కుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అవినీతికి దారితీస్తోందన్నారు. కర్నాటకలోని బొమ్మై ప్రభుత్వం 40 శాతం కమిషన్ల ప్రభుత్వంగా పేరు తెచ్చుకుందని, దేశంలో అత్యంత అవినీతిమయమైన ప్రభుత్వం ఇదేనని ఆరోపించారు రాహుల్.

First Published:  21 March 2023 7:33 AM IST
Next Story