కర్నాటక అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్
ఎన్నికల గడువు దగ్గర పడుతున్నవేళ అన్ని రాజకీయ పార్టీలూ అభ్యర్థుల ఎంపికలో తలమునకలవుతుండగా, అందరికంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ తమ జాబితాను విడుదల చేయడం గమనార్హం.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కోసం అక్కడి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తమ అభ్యర్థుల తొలి జాబితాను శనివారం విడుదల చేసింది. ఈ ఏడాది మే నెలతో ప్రస్తుత శాసనసభ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగే అవకాశముంది. అయితే కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ ఇంకా షెడ్యూల్ ప్రకటించలేదు
ఎన్నికల గడువు దగ్గర పడుతున్నవేళ అన్ని రాజకీయ పార్టీలూ అభ్యర్థుల ఎంపికలో తలమునకలవుతుండగా, అందరికంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ తమ జాబితాను విడుదల చేయడం గమనార్హం. మొత్తం 124 మంది అభ్యర్థులతో కూడిన ఈ తొలి జాబితాలో ఈసారి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరుణ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు.
సిద్ధరామయ్య గతంలో అనేకసార్లు చాముండేశ్వరి, వరుణ నియోజకవర్గాల్లో పోటీచేసి విజయం సాధించారు. 2018లో తన కుమారుడు యతీంద్ర కోసం వరుణ నియోజకవర్గాన్ని ఆయన త్యాగం చేసి.. తాను బదామీ స్థానం నుంచి పోటీచేసి గెలుపొందారు. రానున్న ఎన్నికల్లో ఆయన కోలారు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. అదే విషయాన్ని అధిష్టానం దృష్టిలోనూ పెట్టారు. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాహుల్‌గాంధీ.. ఈసారి కోలారు నుంచి పోటీ వద్దని ఆయనకు సూచించారు. దీంతో సిద్ధరామయ్య వరుణ నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ఆ మేరకు జాబితాలో ఆయన పేరు వరుణ నియోజకవర్గం నుంచి ప్రకటించారు.
సిద్ధరామయ్య కుమారుడు, వరుణ సిట్టింగ్ ఎమ్మెల్యే యతీంద్రకు ఈసారి అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో చోటు దక్కలేదు. ఈసారి ఆయన అసెంబ్లీ ఎన్నికల బరిలో పోటీకి దిగే అవకాశం లేదని తెలుస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో యతీంద్రకు ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.