పూణే యాక్సిడెంట్ ఘటన..వ్యాసరచన పోటీలు పెట్టి కాంగ్రెస్ వినూత్న నిరసన
మే 19న ప్రమాదం జరిగిన స్థలికి చేరుకున్న యూత్ కాంగ్రెస్ నాయకులు అక్కడ వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ' ఒకవేళ మా నాన్న బిల్డర్ అయితే?', 'ఆల్కహాల్ వల్ల కలిగే దుష్పరిణామాలు', 'అధికార వ్యవస్థ నిద్రపోతోందా?' వంటి అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
మహారాష్ట్రలోని పూణేలో ఓ టీనేజర్ రాష్ డ్రైవింగ్ కారణంగా ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి జువైనల్ జస్టిస్ బోర్డ్ గంటల వ్యవధిలోని నిందితుడికి బెయిల్ ఇవ్వడం, ప్రమాదం జరిగిన తీరుపై వ్యాసరచన రాయాలని సూచించడంపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం వినూత్న రీతిలో నిరసన తెలిపింది.
మే 19న ప్రమాదం జరిగిన స్థలికి చేరుకున్న యూత్ కాంగ్రెస్ నాయకులు అక్కడ వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ' ఒకవేళ మా నాన్న బిల్డర్ అయితే?', 'ఆల్కహాల్ వల్ల కలిగే దుష్పరిణామాలు', 'అధికార వ్యవస్థ నిద్రపోతోందా?' వంటి అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు వందమంది హాజరుకాగా.. వ్యాసం బాగా రాసిన వారికి యూత్ కాంగ్రెస్ నాయకులు నగదు బహుమతి కూడా అందజేశారు. వ్యాసరచనలో పాల్గొని వ్యాసాలు రాసిన వారి పత్రాలను రాష్ట్ర హోంమంత్రి, పోలీస్ కమిషనర్ లకు పంపించారు.
ఇదిలా ఉంటే..ఈ కేసు మొదటి నుంచి పక్కదోవ పడుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. మైనర్ బాలుడు మద్యం సేవించినప్పటికీ సేవించలేదని వైద్యులు ధ్రువీకరించడం, బెయిల్ వెంటనే రావడం, ప్రమాదం జరిగిన సమయంలో బాలుడు డ్రైవింగ్ చేయలేదని..ఆ ఇంటి డ్రైవర్ చేశాడని నిరూపించే ప్రయత్నం చేయడం వంటివి జరగడంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు యూత్ కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పూణేలో నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న పబ్ లు, రెస్టారెంట్లపై చర్యలు తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.