కాంగ్రెస్ కు ఫుల్ టైమ్ అధ్యక్షుడు కావాలి, పార్ట్ టైమర్ కాదు : జి-23 సభ్యుడు చవాన్ మెలిక
కాంగ్రెస్ కు ఫుల్ టైమ్ అధ్యక్షుడు కావాలి, పార్ట్ టైమర్ కాదు అని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృధ్విరాజ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.చవాన్ ఈ వ్యాఖ్యలు అశోక్ గెహ్లాట్ ను ఉద్దేశించే చేసినవేనని స్పష్టమవుతోంది.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపద్యంలో జి-23 సభ్యుడు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృధ్విరాజ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అంతర్గత ఎన్నికలు నిర్వహించాలని సంస్కరణల ద్వారా పార్టీని పటిష్టపర్చాలని తాము రెండేళ్ళ క్రితం లేవనెత్తిన డిమాండ్ నేటికి నెరవేరడం సంతోషంగా ఉంది. అయితే పార్టీకి పూర్తికాలం అధ్యక్షఫుడు కావాలే తప్ప పార్ట్ టైమర్ కాదని చవాన్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడైన వ్యక్తి పూర్తికాలం పార్టీ కోసం పనిచేసేలా ఉండాలని, అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని చవాన్ కొత్త పాయింట్ లేవనెత్తారు. చవాన్ వ్యాఖ్యలు అశోక్ గెహ్లాట్ ను ఉద్దేశించే చేసినవేనని స్పష్టమవుతోంది. గాంధీ కుటుంబీకులు ఎవరూ అధ్యక్ష పదవికి పోటీ చేయడంలేదని, తాను నామినేషన్ దాఖలు చేస్తున్నట్టు గెహ్లాట్ స్పష్టం చేశారు. అయితే ఆయన ఇప్పటికిప్పుడు రాజస్థాన్ ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదన్నట్టు గా కూడా వ్యాఖ్యానించారు. తాత్కాలిక అధినేత్రి సోనియా గగాంధీ, రాష్ట్ర ఇన్ ఛార్జి అజయ్ మాకెన్ సీఎంగా తన వారసుడు ఎవరన్న అంశాన్ని తేలుస్తారని అశోక్ గెహ్లాట్ చెప్పడం వెనక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ తన ప్రత్యర్ధి సచిన్ పైలట్ కు ముఖ్యమంత్రి పదవి దక్కకూడదన్న విధంగా ఆయన పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.
ఈ నేపధ్యంలో పృధ్విరాజ్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో మళ్ళీ విభేదాలకు దారితీసే అవకాశం ఉంది. ప్రజాస్వామ్య ప్రక్రియలో సమస్య తలెత్తినప్పుడు మేము ఖచ్చితంగా మా గళం వినిపిస్తాం. సోనియా వారసుడిని ఎంపిక చేయాలంటూ పిసిసిల లేఖలు ఎందుకు అని చవాన్ ప్రశ్నించారు. అయితే ఆయన సభ్యుడుగా ఉన్న రాష్ట్ర పిసిసి కూడా ఇదే తీర్మానాన్ని చేసి పంపండం గమనార్హం. మేము గాంధీ కుటుంబానికి వ్యతిరేకం కాదు. ఏ వ్యక్తి అయినా సరే ఎన్నికలు ద్వారానే పార్టీ అధ్యక్షుడు కావాలని, ఆ వ్యక్తి ప్రజలతో నిరంతరం మమేకం కావాలనే మేము డిమాండ్ చేశాం. అందుకు సోనియా అంగీకరించారు.
రాజస్థాన్‌లో ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే పార్టీ చీఫ్‌గా ఉండాలనే గెహ్లాట్ కోరికను చవాన్ వ్యతిరేకించారు. "అతను ఒక సీనియర్ నాయకుడు, మంచి నాయకుడు. అతనికి మద్దతివ్వాలా వద్దా అనేది మేము ఇంకా నిర్ణయించలేదు. కానీ అతను రెండు పదవులపై పట్టుదలతో ఉంటే, అప్పుడు మేము వ్యతిరేకిస్తాం. కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నది పార్ట్‌టైమ్ ఉద్యోగమా? ముఖ్యమంత్రి పార్ట్‌టైమ్ ఉద్యోగమా?"
"అతను రెండు-మూడు నెలలు చీఫ్‌గా ఉండాలని, ఆపై రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నుండి తిరిగి రాగానే రాజీనామా చేయాలని అనుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఆ సమయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి రాహుల్ గాంధీ తప్ప వేరే మార్గం ఉండదు. కానీ ఆ విషయం ఇప్పుడు సెటిల్ అయిందని నేను అనుకుంటున్నాను. " అన్నారాయన.