Telugu Global
National

అధ్య‌క్ష ఎన్నిక‌ల‌పై కాంగ్రెస్ ఎంపి మ‌నీష్ తివారీ కీల‌క వ్యాఖ్య‌లు

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై ఆ పార్టీ ఎంపీ మనీష్ తివారీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో లోపాలను ఎత్తి చూపుతూ ఆయ‌న వరుస ట్వీట్లు చేశారు. పారదర్శకతను పాటించేందుకు ఓటర్ల జాబితాను బహిరంగంగా అందుబాటులో ఉంచాలని మనీష్ తివారీ పిలుపునిచ్చారు.

అధ్య‌క్ష ఎన్నిక‌ల‌పై కాంగ్రెస్ ఎంపి మ‌నీష్ తివారీ కీల‌క వ్యాఖ్య‌లు
X

నాయ‌క‌త్వ స‌మ‌స్య‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న కాంగ్రెస్ పార్టీకి అధ్య‌క్ష ఎన్నిక‌లు స‌వాల్ గా మారాయి. పార్టీ తీరును నిర‌సిస్తూ సీనియ‌ర్ నాయ‌కులు ఒక్కొక్క‌రూ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు. అధ్య‌క్ష స్థానాన్ని ఆశించిన గులాంన‌బీ ఆజాద్ పార్టీకి రాజీనామా చేసి బ‌య‌టికి వెళ్తూ అగ్ర‌నాయ‌కులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేసి సంచ‌ల‌నం సృఫ్టించారు. పార్టీ అధికార ప్ర‌తినిధి జై వీర్ షెర్గిల్ రాహుల్ గాంధీని క‌లుసుకునేందుకు దాదాపు యేడాదిన్న‌ర‌పాటు ప్ర‌య‌త్నించాల్సి వ‌చ్చింద‌ని ఆజాద్ బుధ‌వారంనాడు చెప్పారు. తాజాగా మ‌రో సీనియ‌ర్ నేత, కాంగ్రెస్ ఎంపి మ‌నీష్ తివారీ కూడా ఈ రోజు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

కాంగ్రెస్ ఎన్నికల ప్రక్రియలో లోపాలను ఎత్తి చూపుతూ ఆయ‌న వరుస ట్వీట్లు చేశారు. పారదర్శకతను పాటించేందుకు ఓటర్ల జాబితాను బహిరంగంగా అందుబాటులో ఉంచాలని మనీష్ తివారీ పిలుపునిచ్చారు.ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయని ఆ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చీఫ్ మధుసూదన్ మిస్త్రీ పేర్కొన్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ ఈ వ్యాఖ్యలు చేయ‌డం గ‌మ‌నార్హం.

" మిస్త్రీ జీ, ఓట‌ర్ల జాబితా బహిరంగంగా అందుబాటులో లేకుండా నిష్పాక్షికంగా, స్వేచ్ఛగా ఎన్నికలు ఎలా జరుగుతాయి?అంటూ తివారీ బుధవారం ఉదయం ట్వీట్ చేశారు. "న్యాయంగా, పార‌ద‌ర్శ‌కంగా, స్వేచ్ఛ‌గా ఎన్నిక‌లు జ‌రిగేందుకు ఓట‌ర్ల పేర్లు, అడ్ర‌స్ ల‌తో కూడిన జాబితాను ఇండియ‌న్ నేష‌న‌ల్ కాంగ్రెస్ (ఐఎన్ సి) వెబ్ సైట్ లో ఉంచాల‌ని మ‌రో ట్వీట్ చేశారు. అంత‌కు ముందు ఒక ఇంట‌ర్వ్యూలో మిస్త్రీ మాట్లాడుతూ ..ఓటర్ల జాబితాను చూడాలనుకునే వారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలను (పిసిసి) సంప్రదించవచ్చని చెప్పారు. దీనిపై తివారీ అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

ఓటర్లు ఎవరో తెలుసుకోవడానికి దేశంలోని ప్రతి పీసీసీ కార్యాలయానికి అ ఎవరైనా ఎందుకు వెళ్లాలి? క్లబ్ ఎన్నికలలో కూడా ఇలా జ‌ర‌గ‌దు. ఎంతో గౌర‌వ ప్ర‌దంగా జ‌రుగుతుంది." అని తివారీ అన్నారు. "ఎవరైనా తన నామినేషన్‌ను దాఖలు చేయవలసి వస్తే 10 మంది కాంగ్రెస్ సభ్యులు ప్రతిపాదించాలి. ముందుగా ఎవ‌రైనా ప్ర‌తిపాదిత స‌భ్యులు చివ‌రి క్ష‌ణంలో వారు చెల్లుబాటు అయ్యే ఓటర్లు కాదని ఎన్నిక‌ల అథారిటీ(సీఈఎ) చెబితే అప్పుడు ఏమ‌వుతుంది. అంటూ తివారీ ప్ర‌శ్నించారు. మొత్తం మీద కాంగ్రెస్‌ లో నేత‌లు ఏదో కార‌ణంతో అసంతృప్తిగా ఉన్న‌ట్టు క‌న‌బ‌డుతోంది. దీనికి కార‌ణం ఎవ‌రి మ‌టుకు వారు కాంగ్రెస్ అధ్య‌క్ష స్థానాన్ని ఆశించ‌డ‌మేన‌ని పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఎన్నిక‌లు అక్టోబ‌ర్ 17న జ‌రుగుతాయ‌ని సిడ‌బ్ల్యుసి ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

First Published:  31 Aug 2022 8:00 AM GMT
Next Story