రాహుల్‌పై చర్యలు తీసుకున్నట్లే.. ఖుష్బూపై తీసుకోగలరా..? కాంగ్రెస్ నేతల ఫైర్
అప్పట్లో ఖుష్బూ చేసిన ట్వీట్ ని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. రాహుల్ గాంధీపై చర్యలు తీసుకున్నట్లు ఖుష్బూపై ఎందుకు తీసుకోవడం లేదని వారు బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాని మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీపై చర్యలు తీసుకున్నట్లే తమిళనాడుకు చెందిన సినీ నటి ఖుష్బూపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రధాని మోడీ ఇంటి పేరుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన వెంటనే ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని లోక్ సభ సెక్రటేరియట్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో మోడీపై వ్యక్తిగత విమర్శలు చేసిన ఖుష్బూపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుతం బీజేపీలో కీలకనేతగా ఉన్న ఖుష్బూ 2018లో కాంగ్రెస్ లో ఉన్నారు. ఆ సమయంలో ఆమె ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. మోడీ ఇంటిపేరు అవినీతిని సూచిస్తోందని 2018లో ఖుష్బూ ఒక ట్వీట్ చేశారు. 'ఇక్కడ మోడీ.. అక్కడ మోడీ.. ఎక్కడ చూసినా మోడీ.. అసలు ఏంటి ఇది..? ప్రతి మోడీ వెనుక అవినీతి అనే ఇంటి పేరు పెట్టాలి. మోడీ అంటేనే అవినీతి. మోడీ పేరును అవినీతిగా మార్చేద్దాం. అదే కరెక్ట్ గా సరిపోతుంది. నీరవ్ మోడీ, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ = అవినీతి' అని ఖుష్బూ ట్వీట్ చేసింది.
मोदी जी @narendramodi क्या आप @khushsundar पर भी मान हानि का मुक़दमा मोदी नाम वाले अपने किसी शिष्य से दायर करवाएँगे? अब तो वे @BJP4India की सदस्य हैं। देखते हैं। धन्यवाद @zoo_bear @INCIndia @RahulGandhi https://t.co/qIibuycY6n
— digvijaya singh (@digvijaya_28) March 25, 2023
అయితే అప్పట్లో ఖుష్బూ చేసిన ట్వీట్ ని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. రాహుల్ గాంధీపై చర్యలు తీసుకున్నట్లు ఖుష్బూపై ఎందుకు తీసుకోవడం లేదని వారు బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'మోడీజీ మోడీ ఇంటిపేరును అవినీతిగా పేర్కొన్న ఖుష్బూపై పరువు నష్టం కేసు వేస్తారా..? ప్రస్తుతం ఆమె బీజేపీలో ఉన్నారు' అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు.
గతంలో కాంగ్రెస్ లో ఉన్న ఖుష్బూ 2020 అక్టోబర్‌లో బీజేపీలో చేరారు. అయితే ఆమెకు బీజేపీ ఎనలేని ప్రాధాన్యం ఇస్తోంది. ఇటీవలే ఆమెను జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. మోడీని విమర్శించిన రాహుల్ పై చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఖుష్బూపై ఎందుకు తీసుకోవడం లేదని ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు. అప్పట్లో మోడీని విమర్శిస్తూ ఖుష్బూ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఖుష్బూ ప్రస్తుతం కక్కలేని మింగలేని స్థితిలో ఉన్నారు.