Telugu Global
National

పేటీఎం-పేసీఎం.. కర్నాటకలో కొత్త ప్రచారం..

పేటీఎం తరహాలోనే T స్థానంలో Cని పెడుతూ PayCM అనే ప్రచారం మొదలు పెట్టారు కర్నాటక కాంగ్రెస్ నేతలు. సీఎం బసవరాజ్ బొమ్మైని ఓ రేంజ్ లో ఆటాడేసుకుంటున్నారు.

పేటీఎం-పేసీఎం.. కర్నాటకలో కొత్త ప్రచారం..
X

పేటీఎం అంటే అందరికీ తెలుసు. ఆ పేరు వినగానే డిజిటల్ చెల్లింపులు చేసే ఆన్ లైన్ యాప్ అని, దాని పక్కనే ఓ క్యూఆర్ కోడ్ కూడా ఉంటుందని అందరికీ అదే గుర్తొస్తుంది. సరిగ్గా పేటీఎం తరహాలోనే T స్థానంలో Cని పెడుతూ PayCM అనే ప్రచారం మొదలు పెట్టారు కర్నాటక కాంగ్రెస్ నేతలు. సీఎం బసవరాజ్ బొమ్మైని ఓ రేంజ్ లో ఆటాడేసుకుంటున్నారు.

ఆమధ్య కర్వాటకలో 40శాతం కమీషన్ అనేది బాగా ప్రచారంలోకి వచ్చింది. ప్రభుత్వంలో ఏ పని కావాలన్నా 40శాతం కమీషన్ సమర్పించుకోవాల్సిందే. కొంతమంది కాంట్రాక్టర్లు బహిరంగంగా ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, చివరకు సీఎం బసవరాజ్ బొమ్మైపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణల క్రమంలోనే ఆయన సీఎం కుర్చీ దిగిపోతారనే ప్రచారం కూడా జరిగింది. చివరకు ఆయనపై కమీషన్ల సీఎంగా ముద్ర పడింది.

హైదరాబాద్ ప్రచారంపై హంగామా..

ఇటీవల బొమ్మైపై హైదరాబాద్ లో కూడా పోస్టర్లు వెలిశాయి. సెప్టెంబర్-17న బీజేపీ కార్యక్రమాల సందర్భంగా బొమ్మైపై సెటైర్లు వేస్తూ హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు రాష్ట్రాల సంబంధాలకు ఇది మంచిది కాదన్నారు. హైదరాబాద్ పోస్టర్లతో పోల్చి చూస్తే, ఇప్పుడు బెంగళూరు సహా ఇతర ప్రాంతాల్లో వెలసిన పోస్టర్లు మరింత ఘాటుగా ఉన్నాయి, చమత్కారం కూడా అదిరిపోయింది. PayCM అనే ఘాటు విమర్శతో బొమ్మై మరింత ఇదైపోతున్నారని సమాచారం.

కాంగ్రెస్ పై ప్రతిదాడి..

సీఎంపై వెలసిన పోస్టర్లను చించేసే బాధ్యత పోలీస్ శాఖకు అప్పగించారు. ఈ పోస్టరన్నిటినీ ఇప్పుడు పోలీసులు తొలగిస్తున్నారు, అసలివి ఎక్కడినుంచి వచ్చాయి, ఎవరు అంటించారు అనే విషయంపై కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అప్ లోడ్ అవుతున్న ఫొటోలపై కూడా ఐటీ విభాగం విచారణ మొదలు పెట్టింది. కాంగ్రెస్ ర్యాగింగ్ ని తట్టుకోలేక ఇప్పుడు బీజేపీ కూడా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఫొటోలతో ప్రచారం మొదలు పెట్టింది. పోస్టర్లు వేస్తోంది.

First Published:  22 Sept 2022 2:29 AM GMT
Next Story