Telugu Global
National

హిమాచల్ లో ప్రియాంక దూకుడు.. డబుల్ ఇంజిన్ పై సెటైర్లు

బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు ప్రియాంక గాంధీ. డబుల్ ఇంజిన్ సర్కార్ ని ఎద్దేవా చేశారు. ఇంధనం లేకుండా చేసి ఎన్ని ఇంజిన్లు పెట్టినా ఏం లాభం అంటూ విమర్శించారు.

హిమాచల్ లో ప్రియాంక దూకుడు.. డబుల్ ఇంజిన్ పై సెటైర్లు
X

ఇంజిన్ డబుల్.. కానీ ఇంధనం నిల్.. అంటూ హిమాచల్ ప్రదేశ్ బీజేపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు భుజానికెత్తుకున్న ప్రియాంక, బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ నేతలు ప్రతి ఇంటికీ వచ్చి తమకు ఓటు వేస్తే డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందని కబుర్లు చెబుతారని, ఇప్పటి వరకూ ఇక్కడ ఉంది డబుల్ ఇంజినే కదా అంటూ ప్రజలు నిలదీయాలన్నారు. బీజేపీ వాహనానికి రెండు ఇంజిన్లు ఉన్నా అందులో ఇంధనం పోయడం మాత్రం మరచిపోయారని ఎద్దేవా చేశారు. అందుకే అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నచందంగా మారిపోయిందని చెప్పారు.

హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు తెలివైన తీర్పుకి ప్రతీకగా నిలుస్తుంటారు. ఓసారి కాంగ్రెస్ కి, మరోసారి బీజేపీకి మార్చి మార్చి అధికారం ఇస్తుంటారు. 1990నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. మధ్యలో ఓ ఏడాది రాష్ట్రపతి పాలన విధించినా ఆ తర్వాత కూడా అధికారం రెండు పార్టీల మధ్య దోబూచులాడుతుంటుంది. ఆ ఆనవాయితీ ప్రకారం ఈసారి అధికారం కాంగ్రెస్‌దేనని చెప్పాలి. హిమాచల్ లో పరిస్థితులు కూడా కాంగ్రెస్ కే అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుత అసెంబ్లీలో బీజేపీకి 45 మంది ఎమ్మెల్యేలుండగా, కాంగ్రెస్ కి 20మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఈ ఏడాది ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు కాంగ్రెస్ హామీలు కూడా ప్రజల్ని ఆకర్షిస్తున్నాయి. హిమాచల్ లో లక్ష ఉద్యోగాల కల్పనతోపాటు, పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇచ్చింది. మహిళలకు నెలకు 1500 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని కూడా మేనిఫెస్టోలో ప్రకటించారు కాంగ్రెస్ నేతలు.

ప్రియాంక దూకుడు..

హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రియాంక చోప్రా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఉనా ప్రాంతంలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న ఆమె బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ని ఎద్దేవా చేశారు. ఇంధనం లేకుండా ఎన్ని ఇంజిన్లు పెట్టినా ఏం లాభం అంటూ విమర్శించారు. చత్తీస్ ఘడ్ లో అభివృద్ధి ఫార్ములాని హిమాచల్ లో కూడా అనుసరిస్తామని హామీ ఇచ్చారు ప్రియాంక.

First Published:  8 Nov 2022 3:56 AM GMT
Next Story