మోడీ ప్రధానిగా ఉన్నంతకాలం.. ఆ పార్టీ తీరు మారదు
మోడీ ప్రధానిగా ఉన్నంతకాలం పార్లమెంట్ ప్రజాస్వామ్యం విషయంలో వారి తీరు మారుతుందని అనుకోవడం లేదని ఆయన పునరుద్ఘాటించారు. మోడీ ఈసారి సంకీర్ణ ప్రభుత్వాన్ని పూర్తికాలం నడపగలరని తాను అనుకోవడం లేదని చెప్పారు.
ప్రధానిగా మోడీ ఉన్నతకాలం బీజేపీ తీరు మారదని కాంగ్రెస్ పార్టీ నేత గౌరవ్ గొగొయ్ విమర్శించారు. మంగళవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీ నాయకత్వ శైలితో ఈ ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వం ఐదేళ్లకాలం అధికారంలో ఉంటుందన్న విశ్వాసం లేదని గౌరవ్ అన్నారు. గత సభలో సభ్యులను భయపెట్టడం, సస్పెండ్ చేయడం వంటివి చేశారని, గతేడాది ఏకంగా 146 మంది ఎంపీలను సస్పెండ్ చేశారని ఆయన గుర్తుచేశారు. ఈసారి 230 మందిని సస్పెండ్ చేస్తారా అంటూ ప్రశ్నించారు.
విపక్ష ’ఇండియా’ కూటమికి పెరిగిన బలంతో ఈసారి పరిస్థితి భిన్నంగా ఉండనుందని గొగొయ్ చెప్పారు. ఫుట్‌బాల్ పదజాలంలో చెప్పాలంటే.. ఇప్పుడు డిఫెండర్స్ సంఖ్య పెరిగిందని, తాము బలంగా మారామని ఆయన తెలిపారు. కేంద్రం అమలు చేసిన డీమానిటైజేషన్ గురించి ఆర్థిక మంత్రికి తెలియదని, ఆర్టికల్ 370 రద్దు గురించి, అగ్నిపథ్ గురించి ఆయన క్యాబినెట్‌కు తెలియదని ఆయన విమర్శించారు. తన క్యాబినెట్‌ను పరిగణనలోకి తీసుకోని వ్యక్తి.. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను ఎలా పరిగణనలోకి తీసుకుంటారని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. మోడీ ప్రధానిగా ఉన్నంతకాలం పార్లమెంట్ ప్రజాస్వామ్యం విషయంలో వారి తీరు మారుతుందని అనుకోవడం లేదని ఆయన పునరుద్ఘాటించారు. మోడీ ఈసారి సంకీర్ణ ప్రభుత్వాన్ని పూర్తికాలం నడపగలరని తాను అనుకోవడం లేదని చెప్పారు.