Telugu Global
National

నేడు రాజస్థాన్‌లో కాంగ్రెస్ కీలక సమావేశం.... నాయకత్వంపై గెహ్లాట్, పైలట్ వ‌ర్గాల మధ్య చీలిక‌ !?

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా సోనియాకు ఇష్టుడైన అశోక్ గెహ్లాట్ ఎన్నిక దాదాపు ఖాయ‌మైన నేపథ్యంలో రాజస్థాన్ లో ముఖ్యమంత్రి పదవి కోసం సీఎల్పీ రెండు వర్గాలుగా విడిపోయింది. సచిన్ పైలెట్ ను ఎలాగైనా ముఖ్యమంత్రి కాకుండా ఆపాలని గెహ్లాట్ వర్గం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

నేడు రాజస్థాన్‌లో కాంగ్రెస్ కీలక సమావేశం.... నాయకత్వంపై గెహ్లాట్, పైలట్ వ‌ర్గాల మధ్య చీలిక‌ !?
X

కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్‌గెహ్లాట్ ఎన్నిక దాదాపు ఖాయ‌మైన నేపథ్యంలో రాష్ట్ర నాయ‌కత్వం విష‌య‌మై ఆదివారంనాడు రాష్ట్రంలో కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశానికి సీనియ‌ర్ నేత‌లు మ‌ల్లికార్జున ఖ‌ర్గే, రాజ‌స్థాన్ వ్య‌వ‌హారాల ఇన్ ఛార్జి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అజ‌య్ మాకెన్ లను ప‌రిశీల‌కులుగా సోనియా గాంధీ నియ‌మించారు. వీరు ఈ రోజు జైపూర్ లో గెహ్లాట్ నివాసంలో సాయంత్రం 7 గంట‌ల‌కు జ‌రిగే కాంగ్రెస్ లెజిస్లేచ‌ర్ పార్టీ (సిఎల్ పి) స‌మావేశానికి హాజ‌రై నాయ‌కుల అభిప్రాయాలు తెలుసుకుని వారితో చ‌ర్చిస్తారు. వారం రోజుల వ్య‌వధిలో ఈ స‌మావేశం జ‌ర‌గ‌డం ఇది రెండోసారి. అంత‌కు ముందు ప‌రిశీల‌కులు సోనియాను క‌లిల‌సి రాజ‌స్థాన్ వ్య‌వ‌హారాల‌పై చ‌ర్చించారు.

ఒక వ్య‌క్తికి ఒకే ప‌ద‌వి అన్న ఉద‌య్ పూర్ నిర్ణయానికి క‌ట్టుబ‌డి ఉండాల్సిందేన‌ని కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ స్ప‌ష్టంచేసిన వియం తెలిసిందే. గెహ్లాట్ పార్టీ అధ్య‌క్షుడిగా ఎన్నికైతే ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఆయ‌న స్థానంలో స‌చిన్ పైల‌ట్ ప‌గ్గాలు చేప‌డ‌తార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నా ఇది అంత తేలికైన విష‌యంగా క‌న‌బ‌డ‌డం లేదు. త‌న వార‌సుడిగా ఎవ‌ర్ని నియ‌మించాలో సోనియా గాంధీకి గెహ్లాట్ ఓ పేరును సూచించార‌ని కూడా చెబుతున్నారు. అయితే పైల‌ట్ కు రాహుల్ గాంధీ మ‌ద్ద‌తు సంపూర్ణంగా ఉండ‌డంతో ఆయ‌న అవ‌కాశాల‌ను కూడా తోసిపుచ్చ‌లేని ప‌రిస్థితి.

నాయ‌కుల మ‌ధ్య భిన్నాభిప్రాయాలు..

ఈ విష‌యంలో గెహ్లాట్‌, పైల‌ట్ వ‌ర్గాల మధ్య‌ చీలిక త‌ప్ప‌ద‌నే సంకేతాలు క‌న‌బ‌డుతున్నాయి. పైల‌ట్ కు ప‌గ్గాలు అప్ప‌గించేందుకు గెహ్లాట్ మ‌న‌స్పూర్తిగా అంగీక‌రించే ప‌రిస్థితి క‌న‌బ‌డ‌డంలేదు. ఈ విష‌యంలో లెజిస్లేచ‌ర్ పార్టీ లో నాయ‌కుల మ‌ధ్య భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప‌లువురు మంత్రులు గెహ్లాట్ ముఖ్య‌మంత్రిగాను, పార్టీ అధ్య‌క్షుడిగానూ ఉండాల‌ని ఆయ‌నకు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. అయితే వీరిలో కొంద‌రు పైల‌ట్ ముఖ్య‌మంత్రి అయినా అంగీకార‌మేనంటూ గోడ‌మీది పిల్లిలా వ్యాఖ్య‌లు చేస్తున్నారు. అధిష్టానం ఏ నిర్ణ‌యం తీసుకున్నా త‌మ‌కు అంగీకార‌మేనంటూ చెబుతున్నారు.

సైనికుల సంక్షేమ శాఖ మంత్రి రాజేంద్ర సింగ్ గూడా రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు పైలట్‌ను "ఉత్తమ వ్య‌క్తి"గా అభివర్ణించారు. మ‌రో మంత్రి గోవింద్ రామ్ మేఘ్వాల్ మాట్లాడుతూ, "ఏడాదిలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నందున, హైకమాండ్ గెహ్లాట్ కు రెండు పదవులు (కాంగ్రెస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి) ఇస్తే మాకు మరింత సంతోషంగా ఉంటుంది."అన్నారు. పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా మేం వెంటే ఉంటామ‌న్నారు.

మ‌రో మంత్రి ప్రతాప్‌సింగ్‌ ఖాచరియావాస్ మ‌ట్లాడుతూ రాష్ట్రంలో నాయకత్వం మార్పు రావాల్సిన అవసరం లేదన్నారు. ''సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిసి త‌మ‌ అభిప్రాయాలను తెలియజేస్తాం. ఎన్నికల్లో అశోక్ గెహ్లాట్ ప్ర‌ణాళిక‌ల‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవ‌స‌రం ఉంది. మేము బీజేపీని ఓడించాలి కాబ‌ట్టి గెహ్లాట్ నాయకత్వంలో ఎన్నికలు జరిగితే పార్టీకి ప్రయోజనం చేకూరుతుంది " అని ఆయ‌న అన్నారు. ఖాచరియావాస్ ఒకప్పుడు సచిన్ పైలట్‌కు విధేయుడుగా ఉండ‌డం గ‌మ‌నార్హం.

First Published:  25 Sept 2022 12:56 PM IST
Next Story