మళ్లీ భారత్ జోడో యాత్ర..! - ఈసారి తూర్పు నుంచి పడమరకు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మరోసారి నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు రాహుల్ సన్నిహితుడు కేసీ వేణుగోపాల్ ఆదివారం ఢిల్లీలో వెల్లడించారు.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో మంచి ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీ ఈ ఉత్సాహాన్ని, జోరును వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొనసాగించేందుకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మరోసారి నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు రాహుల్ సన్నిహితుడు కేసీ వేణుగోపాల్ ఆదివారం ఢిల్లీలో వెల్లడించారు.
కర్నాటక ఎన్నికల ఫలితాలు ప్రతిపక్షాల ఐక్యతకు సందేశం వంటివని.. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలన్నీ కలిసి పోటీ చేయాల్సిన అవసరాన్ని ఇది గుర్తు చేస్తోందని వేణుగోపాల్ వివరించారు. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ సైద్ధాంతిక విభేదాలతో ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ.. ఎన్నికల అనంతరం ఇతర ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. అయితే కేరళలో సీపీఎంతో, తెలంగాణలో బీఆర్ఎస్‌తో మాత్రమే పొత్తులు పెట్టుకోలేమని చెప్పారు.
గతేడాది రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర కారణంగానే కర్నాటకలో కాంగ్రెస్ భారీ విజయాన్ని సాధించిందని, బీజేపీని మట్టి కరిపించిందని వేణుగోపాల్ తెలిపారు. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య ఫ్రంట్ వైపు అడుగులేసేలా కర్నాటకలో విజయం ప్రతిపక్షాలకు ఊపునిచ్చిందని వివరించారు.