Telugu Global
National

'చీతా' క్రెడిట్ మాదే.. బీజేపీకి షాకిచ్చిన కాంగ్రెస్..

మోదీ పుట్టినరోజు కూడా ఈరోజే కావడంతో ఈ వ్యవహారాన్ని బీజేపీ గట్టిగా ప్రచారం చేసుకుంటోంది. బీజేపీ వల్లే ఈ ఘనత సాధ్యమైందని చెప్పుకుంటోంది. సడన్ గా చీతాలు వచ్చేరోజు కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఫొటోలు బీజేపీకి షాకిచ్చాయి.

చీతా క్రెడిట్ మాదే.. బీజేపీకి షాకిచ్చిన కాంగ్రెస్..
X

దేశంలో ఏ కొత్త ప్రయత్నం జరిగినా దానికి 'కర్త, కర్మ, క్రియ' మోదీయేనంటూ గొప్పలు చెప్పుకుంటుంది బీజేపీ. ఏ తప్పు జరిగినా దానికి ఆనాటి కాంగ్రెస్ పాలనే కారణం అంటూ కవర్ చేసుకోవాలని చూస్తుంది. ప్రస్తుతం 'చీతా' ప్రాజెక్ట్ విషయంలో కూడా బీజేపీ ఇలా ఆత్మస్తుతి పరనిందకు పాల్పడాలనుకుంది. భారత్ కు 'చీతా'లను తీసుకొస్తోంది తామేనంటూ కాషాయదళం కబుర్లు చెబుతోంది. దీనికి కాంగ్రెస్ నుంచి కౌంటర్ పడింది. ఇన్నాళ్లూ బీజేపీ నేతల్ని ఎగిరెగిరి పడనిచ్చారు. సరిగ్గా 'చీతా'లు భారత్ కి వచ్చే వేళ ఒక్క ట్వీట్ తో వారికి షాకిచ్చారు కాంగ్రెస్ నేతలు.

దేశంలో 'చీతా'ల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నమీబియా నుంచి 8 'చీతా'లను భారత్‌ కు తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ప్రత్యేక విమానంలో అవి భారత్ లో అడుగుపెట్టబోతున్నాయి. అయితే 'చీతా'లు భారత్‌ కు రావడానికి ప్రధాన కారణం తామేనని చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. అంతే కాదు, రుజువులు కూడా బయటపెట్టి బీజేపీ నేతలకు షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీ 14 ఏళ్ల క్రితం చేసిన ప్రయత్నాల వల్లే ఇప్పుడు 'చీతా'లు భారత్‌ లోకి వస్తున్నాయని సాక్ష్యాలతో సహా రుజువు చేస్తున్నారు.

2008-09లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రాజెక్ట్ 'చీతా' ప్రతిపాదనను సిద్ధం చేసింది. 2010 ఏప్రిల్‌లో అప్పటి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి జైరాం రమేష్ ఈ ప్రాజెక్ట్ కోసం ఆఫ్రికాలోని చీతా ఔట్‌ రీచ్ సెంటర్‌ కు వెళ్లారు. అయితే 2013లో సుప్రీంకోర్టు ఈ ప్రాజెక్టును నిలిపివేయడంతో చీతాలు భారత్ కి రావడం సాధ్యం కాలేదు. 2020లో నిషేధాన్ని తొలగించడంతో ఇప్పుడు మోదీ హయాంలో చీతాలు భారత్ కి వస్తున్నాయి. దీన్ని బీజేపీ గొప్పగా చెప్పుకోవడం తగదంటున్నారు కాంగ్రెస్ నేతలు. గతంలో ప్రాజెక్ట్ చీతా కోసం జైరాం రమేష్ ఆఫ్రికాలోని చీతా ఔట్ రీచ్ సెంటర్ కి వెళ్లిన ఫొటోలను కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు విడుదల చేసింది. చీతా ప్రాజెక్ట్ క్రెడిట్ పూర్తిగా కాంగ్రెస్ దే నంటోంది.

నమీబియానుంచి బోయింగ్ విమానం బి747 జంబోజెట్‌ లో 5 ఆడ, 3 మగ చీతాలు వస్తున్నాయి. ఈ విమానం నేరుగా జైపూర్ కి వస్తుంది. అక్కడినుంచి హెలికాప్టర్లలో మధ్యప్రదేశ్‌ లోని కునో నేషనల్‌ పార్కు కు వాటిని తరలిస్తారు. ప్రధాని మోదీ వీటిని పార్క్ లోకి వదిలిపెడతారు. మోదీ పుట్టినరోజు కూడా ఈరోజే కావడంతో ఈ వ్యవహారాన్ని బీజేపీ గట్టిగా ప్రచారం చేసుకుంటోంది. బీజేపీ వల్లే ఈ ఘనత సాధ్యమైందని చెప్పుకుంటోంది. సడన్ గా చీతాలు వచ్చేరోజు కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ఫొటోలు బీజేపీకి షాకిచ్చాయి.

First Published:  17 Sept 2022 7:18 AM IST
Next Story