Telugu Global
National

బేటీ డరావో.. బ్రిజ్‌ భూషణ్‌ బచావో

బ్రిజ్‌ భూషణ్‌ ను రక్షించేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్నంతా కేంద్రం రంగంలోకి దించిందని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. భారత క్రీడలకు ఇది చీకటి రోజు అని పేర్కొన్నారు.

బేటీ డరావో.. బ్రిజ్‌ భూషణ్‌ బచావో
X

బేటీ బచావో, బేటీ పఢావో అనేది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నినాదం. అయితే దీని అమలు మాత్రం సాధ్యం కావడంలేదు. పైగా బీజేపీ హయాంలో ఆడవారికి రక్షణ కరువైంది. అందులోనూ దేశానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన మహిళా క్రీడాకారులకు కూడా రక్షణ లేదనే విషయం తాజాగా రుజువైంది. క్రీడాకారులకు మద్దతుగా నిలవాల్సిన కేంద్రం, పోలీసులు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ కి వత్తాసు పలకడం మరింత ఆందోళన కలిగించే విషయం. అందుకే కాంగ్రెస్ కొత్త స్లోగన్ తెరపైకి తెచ్చింది. బేటీ డరావో (అమ్మాయిలను భయపెట్టు)- బ్రిజ్‌ భూషణ్‌ బచావో (బ్రిజ్‌ భూషణ్‌ ను రక్షించు) అంటూ బీజేపీకి కౌంటర్లిస్తోంది.

పోక్సో కేసుని రద్దు చేయాలి

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ పై ఢిల్లీ పోలీసులు పటియాలా హౌస్‌ కోర్టులో 1,500 పేజీల ఛార్జిషీట్‌ ను దాఖలు చేశారు. ఇందులో మైనర్‌ రెజ్లర్‌ ఫిర్యాదు ఆధారంగా నమోదైన పోక్సో కేసును మాత్రం రద్దు చేయాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. ఈ ఫిర్యాదుకు సంబంధించి తగిన ఆధారాలు లేవని వారు పేర్కొన్నారు. అందుకే ఆ కేసు రద్దు చేయాలన్నారు.

సిగ్గుచేటు..

కేసుకి సంబంధించిన ఆధారాలు సేకరించడం పోలీసుల విధి. కానీ ఆధారాలు లేవని పేర్కొంటూ కేసు రద్దు చేయాలని పోలీసులే న్యాయస్థానాన్ని కోరటం సిగ్గుచేటని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఆమధ్య బీజేపీ నేతలు.. మైనర్ రెజ్లర్ తండ్రిని బెదిరించి కేసు వాసపు తీసుకునేలా చేశారని, ఇప్పుడు పోలీసులతో ఇలా నాటకాలాడిస్తున్నారంటూ మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు.

ప్రస్తుతం ఆరుగురు రెజ్లర్ల వాంగ్మూలాలతో బ్రిజ్ భూషణ్ పై చార్జ్ షీట్ ఫైల్ చేశారు ఛార్జిషీటులో సెక్షన్‌ 354, 354-ఎ, 354-డి, 506 కింద కేసులు పెట్టారు. పోక్సో కేసు విషయంలో ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. బ్రిజ్‌ భూషణ్‌ ను రక్షించేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్నంతా కేంద్రం రంగంలోకి దించిందని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. భారత క్రీడలకు ఇది చీకటి రోజు అని పేర్కొన్నారు.

First Published:  16 Jun 2023 7:09 AM IST
Next Story