కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికపై గందరగోళం..రేసులో డిగ్గీ రాజా!?
కాంగ్రెస్ అధ్యక్షపదవి కోసం జరగనున్న ఎన్నిక గందరగోళంగా తయారయ్యింది. అధిష్టానం ఒకటి తలిస్తే అశోక్ గెహ్లెట్ మరోటి తలవడంతో ఇప్పుడు అధ్యక్షపదవికి ఎవరెవరు పోటీ పడతారన్నది తేలడం లేదు.
సాఫీగా సాగిపోతుందనుకున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక రాజస్థాన్ లో ఎమ్మెల్యేల తిరుగుబాటుతో గందరగోళంగా మారింది. ఈ తిరుగుబాటుకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మద్దతు ఉండి ఉంటుందని అధిష్టానంతో సహా అంతా భావించారు. గెహ్లాట్ ను రేస్ నుంచి తప్పించాలని కొందరు సిడబ్ల్యుసి సభ్యులు సూచించారని వార్తలు వచ్చాయి. కొత్త సీఎంను ప్రకటించేందుకు రాజస్థాన్ వెళ్ళిన పార్టీ సీనియర్ నాయకులు మల్లిఖార్జున ఖర్గె, అజయ్ మాకెన్ లు తమ నివేదికను అధినేత్రి సోనియా గాంధీకి ఇచ్చారు. మాకెన్ ఇచ్చిన నివేదికలో ఇదిమిద్దంగా ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని తెలిసింది. ఈ తిరుగుబాటు ఉదంతంతో గెహ్లాట్ కు సంబంధం లేదని ముగ్గురు ఎమ్మెల్యేలే ఇదంతా ప్రేరేపించారని, గెహ్లాట్ సేఫ్ అని ఆ తర్వాత వార్తలు వెలువడ్డాయి. అయితే ఇప్పటికీ అధిష్ఠానం గెహ్లాట్ అభ్యర్ధిత్వంపై ఎటూ స్పష్టంగా తేల్చుకోలేకపోతోంది.
గెహ్లాట్ కు సన్నిహితంగా ఉండే కొందరు నాయకులు ఆయనతో చర్చిస్తున్నారని అంటున్నారు. ఈ తరుణంలో కూడా రాజస్థాన్ లోనూ, ఢిల్లీలోనూ గెహ్లాట్ సన్నిహితులుగా చెప్పుకుంటున్నవారు మాత్రం " గెహ్లాట్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేదే లేదు" అంటూ చెప్పడం గమనార్హం. " అశోక్ గెహ్లాట్ నాయకత్వంలో కాంగ్రెస్ పని చేస్తుంది. ఆయన రాజీనామాపై మేం చర్చించలేదు. ఆయన ఈ రోజు రాజీనామా చేయడం లేదు, భవిష్యత్తులో కూడా రాజీనామా చేయరు'' అని రాష్ట్ర మంత్రి ప్రతాప్‌సింగ్ కచార్యవాస్ అన్నారు. మరో మంత్రి విశ్వేంద్ర సింగ్ మాట్లాడుతూ, "గెహ్లాట్ రాజస్థాన్‌లో తన ఐదేళ్లు పదవీకాలం పూర్తి చేసుకుంటాడు.'' అన్నారు.
ఒక వ్యక్తికి ఒకే పదవి అన్న ఉదయ్ పూర్ తీర్మానానికి కట్టుబడి ఉండాల్సిందేనని రాహుల్ గాంధీ స్పష్టం చేయడంతో అధ్యక్షుడిగా ఎన్నికైతే గెహ్లాట్ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆయన స్థానంలో సచిన్ పైలట్ ను కూర్చోబెట్టాలని అధిష్టానం భావించింది. అయితే గతంలో తిరుగుబాటు చేసిన పైలట్ కు ఆ పదవి ఎలా ఇస్తారు.. తమలో ఎవరో ఒకరికి పదవి ఇవ్వాలంటూ గెహ్లాట్ అనుచరులు రాజీనామాలకు సిద్ధపడ్డారు.
ఇదిలా ఉండగా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ బుధవారం రాత్రికి ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఆయన ప్రస్తుతం రాహుల్ గాంధీతో భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్నారు. అకస్మాత్తుగా ఆయన ఢిల్లీ వెళ్ళడం వెనక కారణాలు ఏంటని తర్జనభర్జన పడుతున్నారు. ఆయన అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తారా అనే అనుమానాలు కలుగుతున్నప్పటికీ సింగ్ మాత్రం సస్పెన్స్ కొనసాగిస్తూ ఏ విషయం తేల్చడం లేదు. నన్నెందుకు రేసు నుంచి తప్పిస్తున్నారని' ఒక సారి 'నేను పోటీ చేయడం లేదని మరో సారి చెబుతూ గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. తాజాగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ, "నేను ఎవరితోనూ ఈ విషయం చర్చించలేదు. నేను హైకమాండ్ నుండి అనుమతి తీసుకోలేదు. నేను పోటీ చేస్తానో లేదో నాకే వదిలేయండి. ఒక వేళ అధిష్టానం నన్ను అడిగితే నామినేషన్ వేస్తాను."అంటూ చెప్పుకొచ్చారు. అలాగే మరో సీనియర్ నేత ఎ కె ఆంటోనీ కూడా అధినేత్రి సోనియా గాంధీతో సమవేశమవుతున్నారు.