Telugu Global
National

గుర్తుల‌పై శివ‌సేన వ‌ర్గాల్లో గంద‌ర‌గోళం.. కొత్త వివాదం

ఇరు శివసేన వర్గాలకు ఎన్నికల సంఘం కేటాయించిన ఎన్నికల గుర్తులు వివాదాస్పదమయ్యాయి. ఉద్దవ్ కు కేటాయించిన కాగడా గుర్తు తమదని సమతా పార్టీ, ఏక్ నాథ్ కు కేటాయించిన గుర్తు తమ మతాచారానికి సంబంధించిందని స‌చ్‌ఖండ్ గురుద్వారా లు చెబుతున్నాయి. వాటిని ఆ పార్టీలకు కేటాయించవద్దని డిమాండ్ చేస్తున్నాయి.

గుర్తుల‌పై శివ‌సేన వ‌ర్గాల్లో గంద‌ర‌గోళం.. కొత్త వివాదం
X

శివ‌సేన వ‌ర్గాల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం కేటాయించిన గుర్తులు వివాదాస్ప‌దం అవుతున్నాయి. అంతేగాక ఈ గుర్తుల‌పై ఉప ఎన్నిక‌లో పోటీ చేయాల‌నుకుంటున్న ఉద్ధ‌వ్‌, షిండే వ‌ర్గాలు గంద‌ర‌గోళానికి గుర‌వుతున్నాయి. ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు చేసిన త‌ర్వాత శివ‌సేన పై ఆధిప‌త్యం కోసం ఇరు వ‌ర్గాలు సుప్రీం కోర్టును ఆశ్ర‌యించాయి. అన‌ర్హ‌త వేటు త‌దిత‌ర పిటిష‌న్లు పై విచార‌ణ పెండింగ్ లో ఉన్నాయి. ఈ లోపు గుర్తుల వివాదాన్ని ప‌రిష్క‌రించే బాధ్య‌త‌ను ఎన్నిక‌ల సంఘానికి అప్ప‌జెప్పింది సుప్రీం కోర్టు. దీనిపై ఇరు వ‌ర్గాలు వేర్వేరుగా చేసిన సూచ‌న‌ల మేర‌కు గుర్తులు కేటాయించింది. శివ‌సేన ఉద్ధ‌వ్ థాక్రే వ‌ర్గానికి మండుతున్న కాగ‌డా(మ‌షాల్‌) గుర్తును, షిండే వ‌ర్గానికి క‌త్తి-డాలు గుర్తును ఎన్నిక‌ల సంఘం కేటాయించింది.

అంధేరీ ఈస్ట్ కు జ‌రిగే ఉప ఎన్నిక‌లో ఉద్ధ‌వ్ వ‌ర్గం త‌ర‌పున దివంగ‌త శివ‌సేన ఎమ్మెల్యే ర‌మేష్ ల‌త్కే భార్య రుతుజ ల‌త్కే కాగ‌డా గుర్తుపైన‌, షిండే వ‌ర్గం నుంచి ముర్జీ ప‌టేల్ క‌త్తి-డాలు గుర్తుపై పోటీ చేస్తున్నారు. వీరు త‌మ ప్ర‌చారాల‌ను కూడా ప్రారంభించారు.

ఇక్క‌డే అస‌లు వివాదం మొద‌లైంది. ఉద్ధ‌వ్ వ‌ర్గానికి కేటాయించిన కాగ‌డా గుర్తును ఎంతో కాలంగా తాము ఉప‌యోగించుకుంటున్నామ‌ని 1996 నుంచి ఆ గుర్తు త‌మ వ‌ద్ద‌నే ఉందంటూ స‌మ‌తా పార్టీ వాదిస్తోంది. ఈ గుర్తును త‌మ‌కు కేటాయిస్తూ స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇవ్వాల‌ని ఆ పార్టీ దీనిపై ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యంచ‌నుంది.

మ‌రో వైపు షిండే వ‌ర్గానికి కేటాయించిన క‌త్తి-డాలు గుర్తు సిక్కు మ‌త విశ్వాసాల‌కు ముడిప‌డి ఉంద‌ని, దానిని మ‌త‌ప‌ర‌మైన గుర్తుగా భావించి దానిని ర‌ద్దు చేయాలంటూ స‌చ్‌ఖండ్ గురుద్వారా మాజీ స‌భ్యుడు రంజీత్ కామ్ టేక‌ర్ ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాశారు. మ‌త ప‌ర‌మైన చిహ్నాల‌ను కేటాయించ‌రాద‌ని ఎన్నిక‌ల‌సంఘం నియ‌మం. అందుకే షిండే వ‌ర్గం సూచించిన త్రిశూలం గుర్తును కూటాయించ‌లేదు.

ఈ ప‌రిస్థితుల నేప‌ధ్యంలో అభ్య‌ర్ధులు ఏమ‌వుతుంద‌ని ఆందోళ‌న చెందుతున్నారు. గుర్తుల వివాదం తేల‌క‌పోతే అంధేరీ ఈస్ట్ ఉప ఎన్నిక పై ప్ర‌భావం చూపుతుంద‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

First Published:  16 Oct 2022 5:24 PM IST
Next Story