Telugu Global
National

కారుణ్య నియామకం హక్కు కాదు -సుప్రీం సంచలన తీర్పు

కారుణ్య నియామకం వారి హక్కు కాదని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. అది కేవలం ఓ ఉపశమనం మాత్రమేనని తేల్చి చెప్పింది.

కారుణ్య నియామకం హక్కు కాదు -సుప్రీం సంచలన తీర్పు
X

కుటుంబంలో సంపాదనపరుడైన వ్యక్తి హఠాత్తుగా చనిపోతే మిగతా సభ్యులపై ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వడమే కారుణ్య నియామకం. కారుణ్య నియామకం అనేది ఆయా కుటుంబాలకు పెద్ద ఊరట. కానీ అది వారి హక్కు కాదని ఇప్పుడు సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. అది కేవలం ఓ ఉపశమనం మాత్రమేనని తేల్చి చెప్పింది.

కారుణ్య నియామకాలకోసం కోర్టులకు వెళ్లి మరీ తమ పంతం నెగ్గించుకున్నవారు చాలామందే ఉన్నారు. ఉద్యోగ అర్హతలు తక్కువ అయినా కచ్చితంగా చనిపోయినవారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలనే నిబంధనలు ఉన్నాయి. కానీ అవి వారికి ఉపశమనంగా కల్పించిన నిబంధనలేనని సుప్రీం తాజాగా తీర్పునివ్వడం సంచలనంగా మారింది.

ఎందుకిలా..?

సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడానికి ప్రత్యేక కారణం ఉంది. కేరళలోని ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ట్రావెన్‌ కోర్‌ లిమిటెడ్‌ సంస్థలో ఓ ఉద్యోగి పనిచేస్తూ రిటైర్మెంట్ కి ముందే చనిపోయాడు. 1995లో ఆయన చనిపోయే సమయానికి ఆయన భార్య కూడా ప్రభుత్వ ఉద్యోగి. అయితే ఆ సమయంలో ఆయన కుమార్తె తనకు ఉద్యోగం కావాలని కోరారు. తండ్రి చనిపోయిన తర్వాత ఆయన స్థానంలో తనకు కారుణ్య నియామకం ఇవ్వాలని అభ్యర్థించారు. కానీ ఆమెకు ఉద్యోగం ఇవ్వలేదు. తీందో ఆమె కేరళ హైకోర్టుని ఆశ్రయించారు. సింగిల్ జడ్జి ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చారు. దీన్ని ద్విసభ్య ధర్మాసనం సమర్థించింది. దీంతో ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ట్రావెన్‌ కోర్‌ లిమిటెడ్‌ సంస్థ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. మరణించిన ఉద్యోగి భార్య అప్పటికే ప్రభుత్వ ఉద్యోగి అని, ఆ కుటుంబంలో ఆయనపై ఆధారపడి జీవించేవారెవరూ లేరని, అందువల్ల కారుణ్య నియామకం కింద ఎవరికీ ఉద్యోగం ఇవ్వలేమని చెప్పింది. కేరళ కోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు లేవనెత్తింది. దీంతో సుప్రీంకోర్టు, కేరళ హైకోర్టు తీర్పుని పక్కనపెట్టింది. కారుణ్య నియామకం హక్కు కాదని తేల్చి చెప్పింది. అది కేవలం మినహాయింపు మాత్రమేనని పేర్కొంది.

ప్రస్తుతం రాష్ట్ర, కేంద్ర సర్వీసుల్లో కారుణ్య నియామకాల విషయంలో.. ఆధారిత కుటుంబ సభ్యులు ఉద్యోగాలు చేస్తుంటే.. ఆ తర్వాత ప్రయారిటీ ప్రకారం మరొకరు ఆ పోస్ట్ లు కోరుకుంటున్నారు. కానీ సుప్రీంకోర్టు తీర్పుతో ఈ వ్యవహారం మారేలా కనిపిస్తోంది. ఉద్యోగిపై పూర్తిగా ఆధారపడిన కుటుంబ సభ్యులు, ఆయన మృతితో ఇబ్బంది పడుతున్న సమయంలో మాత్రమే కారుణ్య నియామకాలు చెల్లుబాటవుతాయని సూచించింది.

First Published:  4 Oct 2022 8:54 AM IST
Next Story