Telugu Global
National

కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింది సరే.. వంటింటి సంగతేంటి..?

వాణిజ్య సిలిండర్‌ని 91 రూపాయలు తగ్గించారు సరే, గృహ అవసరాల సిలిండర్ పై కనీసం రూపాయి తగ్గుదల కూడా లేదేంటని ప్రశ్నిస్తున్నారు సామాన్యులు. గ్యాస్ రేట్లు పెరిగే సమయంలో ఎడాపెడా అన్నిటిపై బాదేసే ప్రభుత్వం, తగ్గింపు విషయంలో మాత్రం పక్షపాతం ప్రదర్శించడం దేనికంటూ విమర్శిస్తున్నారు.

కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింది సరే.. వంటింటి సంగతేంటి..?
X


అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు తగ్గడంతో భారత్‌లో సిలిండర్ ధర తగ్గింది. అయితే ఇక్కడ ప్రభుత్వానికి పేదల వంటింటిపై ఏమాత్రం ప్రేమ లేదని మరోసారి రుజువైంది. అంతర్జాతీయంగా ధరలు తగ్గడం వల్ల కేవలం వాణిజ్య అవసరాలకు ఉపయోగించే సిలిండర్ ధరను రూ.91.50 తగ్గించారు. కానీ పేదలు వంటింట్లో వాడుకునే డొమెస్టిక్ సిలిండర్ రేటు ఏమాత్రం తగ్గలేదు. వాణిజ్య సిలిండర్‌ని 91 రూపాయలు తగ్గించారు సరే, గృహ అవసరాల సిలిండర్ పై కనీసం రూపాయి తగ్గుదల కూడా లేదేంటని ప్రశ్నిస్తున్నారు సామాన్యులు. గ్యాస్ రేట్లు పెరిగే సమయంలో ఎడాపెడా అన్నిటిపై బాదేసే ప్రభుత్వం, తగ్గింపు విషయంలో మాత్రం పక్షపాతం ప్రదర్శించడం దేనికంటూ విమర్శిస్తున్నారు.

గ్యాస్ బుకింగ్ 15 రోజులకోసారి..

గ్యాస్ సబ్సిడీ పూర్తిగా ఎత్తివేయడానికి ప్రయత్నించే క్రమంలో గ్యాస్ సిలిండర్ల పరిమితిని గతంలో కేంద్రం ఎత్తివేసింది. ఏడాదికి 12 సిలిండర్ల లిమిట్‌ని తొలగించి రేట్లు భారీగా పెంచింది. ఇప్పుడు మళ్లీ ఆ పరిమితిని తెరపైకి తెస్తోంది. నెలకి రెండు సార్లు మాత్రమే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. అంటే ఒకసారి గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే, మళ్లీ బుకింగ్ కోసం 15 రోజులు ఆగాల్సిందే. ఈలోగా ఎలాంటి ఇబ్బందులొచ్చినా, పండగలొచ్చినా, బంధువుల రాకతో గ్యాస్ అయిపోయినా చేసేదేమీ లేదు, బ్లాక్ మార్కెట్టే దిక్కు.

గతంలో లేచిన నోళ్లు ఇప్పుడేమయ్యాయి..?

యూపీఏ హయాంలో గ్యాస్ సిలిండర్ రేటు ఐదు, పది రూపాయలు పెరిగినా బీజేపీ నేతలు గగ్గోలు పెట్టేవారు. స్మృతి ఇరానీ అప్పట్లో ఎంత హడావిడి చేశారో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు గ్యాస్ రేటు పెంపు అంటే మినిమమ్ 50 రూపాయలు అనుకునే స్థాయికి తీసుకొచ్చింది ఎన్డీఏ సర్కారు. గ్యాస్ సిలిండర్ల రేట్లు పెంచి, పరిమితి తగ్గించి వినియోగదారులకు నరకం చూపెడుతోంది. ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టిపెడుతున్నామని ప్రకటించుకుంటున్న కేంద్రం.. గ్యాస్ రేట్లు పెంచేసి, తిరిగి ప్రజలకు కట్టెలపొయ్యే దిక్కయ్యేలా చేస్తోంది.

First Published:  2 Sept 2022 12:23 PM IST
Next Story