Telugu Global
National

ఎండు గడ్డికి పచ్చ రంగు.. డబుల్ ఇంజిన్ దౌర్భాగ్యం

రోజూ నీళ్లు పోసే దిక్కులేదు కానీ, ఇప్పుడు దానికి పచ్చ రంగు పిచికారీ చేయించారు. ఎండు గడ్డిని, పచ్చికగా నమ్మించేందుకు రంగులేయించారు.

ఎండు గడ్డికి పచ్చ రంగు.. డబుల్ ఇంజిన్ దౌర్భాగ్యం
X

డబుల్ ఇంజిన్ లో ఇదో కొత్తకోణం, మసిపూసి మారేడుకాయ చేయడం ఎలా అనేదానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన నిర్వచనం. ఏకంగా ఎండుగడ్డికే రంగులేయించారు కమలనాథులు. తమ రాష్ట్రం పచ్చగా ఉందని కలరింగ్ ఇచ్చారు. ఇదంతా ఎవరి మెప్పుకోసమో చేసినా, ఇప్పుడీ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం పరువు పూర్తిగా పోయింది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ మొదలు కాకముందే మధ్యప్రదేశ్ అసలు రంగు బయటపడింది.

మధ్యప్రదేశ్‌ లోని ఇండోర్‌ లో ఈనెల 11, 12 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, ప్రవాసీ భారతీయ సమ్మేళనం జరగాల్సి ఉంది. ‘మధ్యప్రదేశ్‌-ది ఫ్యూచర్‌ రెడీ స్టేట్‌’ పేరుతో ఈ సమ్మిట్‌ నిర్వహిస్తున్నారు. ఏర్పాట్లలో భాగంగా అక్కడ స్థానిక నేతలు, అధికారులు కలసి చేసిన పని వార్తల్లోకెక్కింది, తీవ్ర విమర్శలపాలవుతోంది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, రాష్ట్ర నేతలు, జాతీయ, అంతర్జాతీయ వ్యాపార ప్రముఖులు హాజరవుతారు. 70మంది వ్యాపారవేత్తలు హాజరవుతుండగా వారి దృష్టిని, పనిలో పనిగా వారి పెట్టుబడుల్ని ఆకర్షించేలా ఏర్పాట్లు చేస్తోంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. ఈ క్రమంలో రోడ్డు పక్కన ఎండిపోయిన గడ్డికి కూడా పచ్చ రంగు వేయించడం చర్చనీయాంశమైంది.


ఇండోర్ సమ్మిట్ కి వెళ్లే దారిలో రోడ్డు పక్కన పెద్ద పెద్ద బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టారు. డివైడర్లకు మంచి మంచి రంగులేయించారు. మధ్యలో గడ్డి ఎండిపోయి ఉండటంతో దాన్ని కూడా ఏదో ఒకటి చేయాలనుకున్నారు. రోజూ నీళ్లు పోసే దిక్కులేదు కానీ, ఇప్పుడు దానికి పచ్చ రంగు పిచికారీ చేయించారు. ఎండు గడ్డిని, పచ్చికగా నమ్మించేందుకు రంగులేయించారు. స్ప్రే పెయింటర్ తో ఆ పనులు చేయిస్తున్న వీడియో సోషల్ మీడియాకి ఎక్కింది. ఇంకేముంది మధ్యప్రదేశ్ పరువు బజారున పడింది.

ది ఫ్యూచర్ రెడీ స్టేట్ అంటూ పెట్టుబడులు ఆకర్షించాలనుకున్న మధ్యప్రదేశ్, ఇలాంటి డూప్ షాట్ వ్యవహారాలతో వార్తల్లోకెక్కడం నిజంగా దౌర్భాగ్యం. గడ్డికి కూడా రంగులేయిస్తున్నరంటే, పెట్టుబడులకోసం వ్యాపారవేత్తల్ని డబుల్ ఇంజిన్ సర్కార్ ఎలా మభ్యపెట్టాలనుకుంటుందో అర్థమవుతోందంటున్నారు నెటిజన్లు. బీజేపీ ప్రభుత్వాలు బుకాయిస్తున్న తీరు ఇక్కడి పనుల్లో కనపడుతోందని సెటైర్లు పడుతున్నాయి. కమలనాథులారా కలరింగ్‌ అంటే ఇదేనా? వావ్‌ శివరాజ్‌ వావ్‌ అంటూ ఓ కాంగ్రెస్ నేతలు కూడా ఓ ఆట ఆడేసుకుంటున్నారు.

First Published:  9 Jan 2023 7:12 AM IST
Next Story