Telugu Global
National

నిందితుడికి 383 ఏళ్ల జైలు శిక్ష‌.. కోయంబ‌త్తూర్ కోర్టు సంచ‌ల‌న తీర్పు

అప్పటి నుంచి ఈ కేసుపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఈలోపే రామచంద్రన్, నటరాజన్, రంగనాథన్, రాజేంద్రన్ మృతిచెందారు. ఈ కేసులో కోర్టు తీర్పు శుక్రవారం వెలువడింది.

నిందితుడికి 383 ఏళ్ల జైలు శిక్ష‌.. కోయంబ‌త్తూర్ కోర్టు సంచ‌ల‌న తీర్పు
X

తమిళనాడులోని కోయంబత్తూర్ న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. నకిలీ పత్రాలు సృష్టించి మోసం చేసిన కేసులో ఓ వ్యక్తికి 383 ఏళ్ల జైలుశిక్ష విధించింది. దీంతో పాటు నిందితుడు రూ.3.32 కోట్ల జరిమానా చెల్లించాల‌ని ఆదేశించింది. తమిళనాడు ఆర్టీసీ కోయంబత్తూర్ డివిజన్‌లోని బస్సుల వేలంలో జ‌రిగిన అక్ర‌మాల కేసు విచార‌ణ‌లో భాగంగా న్యాయ‌స్థానం ఈ తీర్పు ఇచ్చింది.

బ‌స్సుల వేలంలో అక్ర‌మాలు జ‌రిగాయంటూ 1988 నవంబరు 9న ఫిర్యాదు నమోదైంది. సంస్థకు చెందిన 47 బస్సులను నకిలీ పత్రాలతో విక్రయించి, రూ.28 లక్షలు మోసం చేశారంటూ 8 మంది ఉద్యోగులపై ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. చేరన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ అసిస్టెంట్ కోదండపాణి, డిప్యూటీ మేనేజర్ రామచంద్రన్, నాగరాజన్, నటరాజన్, మురుగనాథన్, దురైసామి, రంగనాథన్, రాజేంద్రన్‌ల‌ను ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.

అప్పటి నుంచి ఈ కేసుపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఈలోపే రామచంద్రన్, నటరాజన్, రంగనాథన్, రాజేంద్రన్ మృతిచెందారు. ఈ కేసులో కోర్టు తీర్పు శుక్రవారం వెలువడింది. కోదండపాణి మినహా మిగిలిన ముగ్గురినీ జడ్జి శివకుమార్ నిర్దోషులుగా పేర్కొన్నారు. సంస్థను మోసం చేసినందుకు కోదండపాణికి 47 నేరాల కింద నాలుగేళ్ల చొప్పున 188 ఏళ్లు, 47 ఫోర్జరీ నేరాలకు నాలుగేళ్ల చొప్పున 188 ఏళ్లు, ప్రభుత్వ ఆస్తులను కాజేసినందుకు ఏడేళ్ల జైలుశిక్షను విధించింది. ఈ మూడు శిక్షల మొత్తం కలిపితే 383 సంవత్సరాలు అవుతుంది. ప్రస్తుతం నిందితుడి వయసు 82 సంవత్సరాలు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏడేళ్ల జైలు శిక్ష‌ను ఏకకాలంలో అనుభవించాలని న్యాయస్థానం ఉత్త‌ర్వులు ఇచ్చింది.

First Published:  30 July 2023 8:37 AM IST
Next Story