KGF సినిమా సీన్.. నడి సముద్రంలో 32 కేజీల బంగారం సీజ్
మండపం ఫిషింగ్ హార్బర్ సమీపంలో రెండు పడవలపై కోస్ట్ గార్డ్ సిబ్బందికి అనుమానం వచ్చింది. పోలీసులకు దొరికిపోతామన్న భయంతో 11.6 కేజీల బంగారం కడ్డీలను స్మగ్లర్లు సముద్రంలో పడేశారు.
KGF సినిమా క్లైమాక్స్ లో హీరో తన దగ్గరున్న బంగారాన్నంతా ఓడలో ఎక్కించి పారిపోతుంటాడు. ఆ స్థాయిలో కాదు కానీ.. కొంతమంది స్మగ్లర్లు ఆ సినిమా సీన్ ని తలపించేలా పడవల్లో బంగారం తరలిస్తూ కోస్ట్ గార్డ్ పోలీసులకు పట్టుబడ్డారు. శ్రీలంకనుంచి భారత్ కు సముద్ర మార్గం ద్వారా ఈ బంగారాన్ని తరలిస్తున్నారు. మొత్తం 32.60 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు అధికారులు. దీని విలువ 20కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.
భయపడి సముద్రంలో పడేశారు..
కొంతమంది స్మగ్లర్లు శ్రీలంకనుంచి భారత్ కు అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు డిఆర్‌ఐ అధికారులకు సమాచారం అందింది. కోస్ట్ గార్డ్, కస్టమ్స్ అధికారలుతో కలసి వారు తమిళనాడు తీరంలో నిఘా పెట్టారు. మండపం ఫిషింగ్ హార్బర్ సమీపంలో రెండు పడవలపై వారికి అనుమానం వచ్చింది. వాటిని కోస్ట్ గార్డ్ సిబ్బంది వెంబడించారు. పోలీసులకు దొరికిపోతామన్న భయంతో 11.6 కేజీల బంగారం కడ్డీలను స్మగ్లర్లు సముద్రంలో పడేశారు. ఆ తర్వాత తప్పించుకోవాలని చూశారు.
అయితే కోస్ట్ గార్డ్ సిబ్బంది వారిని వదల్లేదు. అదుపులోకి తీసుకుని బంగారాన్ని వెలికి తీయడానికి ప్రయత్నించారు. గజ ఈతగాళ్లు, డైవర్ల సహాయంతో రెండురోజులపాటు శ్రమించారు. సముద్రంలో పారేసిన బంగారాన్ని వెలికి తీశారు. మరో పడవలో ఉన్న 21 కేజీల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు.
సముద్ర మార్గంలో ఈ స్థాయిలో భారీగా బంగారం స్మగ్లింగ్ చేయడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి అంటున్నారు అధికారులు. తరచూ విమానాశ్రయాల్లో బంగారం స్మగ్లింగ్ బండారం బయటపడుతోంది. అందుకే స్మగ్లర్లు సముద్రమార్గాన్ని ఎంచుకున్నట్టున్నారు. కానీ కోస్ట్ గార్డ్ సిబ్బందికి బంగారంతో సహా దొరికిపోయారు.