ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలిపై మూత్రం..
బస్సు చివరి సీటులో కూర్చున్న రామప్ప అనే యువకుడు ముందు వరుస దగ్గరకు వచ్చి అక్కడ నిద్రపోతున్న ఓ మహిళపై మూత్రం పోశాడు. ఒక్కసారిగా షాకైన ఆ మహిళ కేకలు వేసింది.
ఎయిరిండియా విమానంలో ప్రయాణికురాలిపై తోటి ప్రయాణికుడు మూత్ర విసర్జన చేసిన విషయం ఎంత సంచలనంగా మారిందో తెలిసిందే. ఆ తర్వాత విమానయాన సంస్థకు డీజీసీఏ భారీ జరిమానా విధించింది. ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలని హెచ్చరించింది.
సరిగ్గా ఇలాంటి ఘటన ఆర్టీసీ బస్సులో కూడా జరిగింది. ఆ ఛండాలానికి కర్నాటక ఆర్టీసీ బస్సు వేదికగా మారింది. బస్సులో నిద్రపోతున్న మహిళా ప్రయాణికురాలిపై ఓ యువకుడు మూత్రవిసర్జన చేశాడు. ఆ ఘటనతో షాకైన మహిళ కేకలు వేయడంతో సిబ్బంది, తోటి ప్రయాణికులు అతడికి దేహశుద్ధి చేశారు, బస్సు దింపేసి, లగేజీ విసిరేసి పంపించేశారు.
కర్నాటక ఆర్టీసీ బస్సు విజయపుర నుంచి మంగళూరుకు వెళ్తోంది. హుబ్బళ్లి సమీపంలోని కిరేసూరులో ఒక దాబా వద్ద మంగళవారం అర్ధరాత్రి టీ కోసం బస్సుని ఆపారు. చాలామంది ప్రయాణికులు బస్సు దిగి టీ తాగేందుకు వెళ్లారు. మరికొందరు మూత్రవిసర్జన కోసం కిందకు దిగారు.
ఈ క్రమంలో బస్సు చివరి సీటులో కూర్చున్న రామప్ప అనే యువకుడు ముందు వరుస దగ్గరకు వచ్చి అక్కడ నిద్రపోతున్న ఓ మహిళపై మూత్రం పోశాడు. ఒక్కసారిగా షాకైన ఆ మహిళ కేకలు వేసింది. దీంతో కింద ఉన్న ప్రయాణికులంతా బస్సులోకి వచ్చారు. మూత్రం పోసిన యువకుడిని చితగ్గొట్టారు.
మద్యం మత్తులో..
బస్సులో మహిళా ప్రయాణికురాలిపై మూత్రం పోసిన రామప్ప అనే యువకుడు ఇటీవలే మెకానికల్ ఇంజినీరింగ్ చదివాడు. మద్యం మత్తులో చివరి సీట్లో నిద్రపోతున్నాడు. సడన్ గా బస్సు ఆగడం గమనించి నిద్రమత్తులోనే నడుచుకుంటూ ముందుకొచ్చాడు.
బస్సు దిగానన్న భ్రమలో అక్కడే మూత్రవిసర్జన చేశాడు. కైపు తలకెక్కి చేసిన ఆ పనికి చివరకు తోటి ప్రయాణికుల చేతిలో దెబ్బలు తిన్నాడు. అయితే ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి నిరాకరించింది. దీంతో అతడిని బస్సులోనుంచి దించేశారు. అక్కడే ఉన్న దాబాలో సదరు మహిళ స్నానం చేసి, దుస్తులు మార్చుకుని తిరిగి ప్రయాణం కొనసాగించింది.