ఫైళ్లన్నీ వెనక్కి.. ఢిల్లీలో సీఎం వర్సెస్ గవర్నర్..
సీఎం సంతకం లేకుండా వస్తే, తానెందుకు సంతకం పెడతానంటూ లాజిక్ తీశారు వీకే సక్సేనా. సరిగ్గా సంతకం చేసి పంపించండి అంటూ ఫైల్ నోట్ రాసి తిప్పి పంపించేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఇప్పటికే ఢిల్లీ రాజకీయం వేడెక్కింది. తాజాగా గవర్నర్ చేసిన పనికి సీఎం కేజ్రీవాల్ మరింత ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 47 ఫైళ్లను గవర్నర్ సంతకం పెట్టకుండా సీఎం ఆఫీస్ కి తిప్పి పంపించారు. సెక్రటేరియట్ కి వాపస్ చేశారు. అందులో విద్యాశాఖ, వక్భ్ బోర్డ్ కి సంబంధించిన కీలక ఫైల్స్ కూడా ఉన్నాయి. ఒక్కదానిపై కూడా సంతకం లేకుండా తిరిగి పంపించడంతో సీఎం కేజ్రీవాల్ గుర్రుగా ఉన్నారని సమాచారం.
సీఎం సంతకం లేదు..
సీఎంఓ నుంచి గవర్నర్ కు వచ్చిన ఫైళ్లపై సీఎం కేజ్రీవాల్ సంతకం లేదనేది ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆరోపణ. ఆ ఫైళ్లపై ఇతర అధికారుల సంతకాలున్నాయని, "వాటిని సీఎం చూశారు, ఆమోదించార"నే నోట్ మాత్రం రాసి ఉందని చెబుతున్నారు. సీఎం సంతకం లేకుండా వస్తే, తానెందుకు సంతకం పెడతానంటూ లాజిక్ తీశారు వీకే సక్సేనా. సరిగ్గా సంతకం చేసి పంపించండి అంటూ ఫైల్ నోట్ రాసి తిప్పి పంపించేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
మొదటినుంచీ..
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం వచ్చాక, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఉక్కపోత తప్పలేదు. ఢిల్లీపై పట్టు పెంచుకోడానికి చాలాసార్లు ప్రయత్నాలు చేసింది కేంద్రం. శాంతి భద్రతలపై రాష్ట్రానికే పర్యవేక్షణ ఉండాలంటూ కేజ్రీవాల్ పోరాటం చేసినా కుదర్లేదు. దీంతో ఢిల్లీలో సీఎం వర్సెస్ లెఫ్ట్ నెంట్ గవర్నర్ అన్నట్టుగా తయారైంది పరిస్థితి. మిగతా రాష్ట్రాల్లో గవర్నర్లు కేవలం నామమాత్రంగా ఉంటారు, కానీ ఢిల్లీలో లెఫ్ట్ నెంట్ గవర్నర్ కి అంతకు మించిన అధికారాలుంటాయి. అందుకే కేజ్రీవాల్ ని కేంద్రం ఇబ్బంది పెడుతోంది. లిక్కర్ స్కామ్ విషయంలో ఐఏఎస్ అధికారుల్ని సైతం లెఫ్ట్ నెంట్ గవర్నర్ నేరుగా సస్పెండ్ చేశారు. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కార్యాలయ అధికారులపై బదిలీ వేటు వేశారు. దీంతో ప్రభుత్వం, లెఫ్ట్ నెంట్ గవర్నర్ మధ్య విభేదాలు ఎక్కువయ్యాయి. తాజాగా 47 ఫైళ్లను వెనక్కి పంపింపి కేజ్రీవాల్ కి మరింత చురుకు పుట్టించారు గవర్నర్ వీకే సక్సేనా.