Telugu Global
National

ఉమ్మడి పౌర స్మృతికి మేం వ్యతిరేకం -స్టాలిన్

భారత సమాజంలోని భిన్న వర్గాల్లో అభివృద్ధి, విద్య, అవగాహన వేర్వేరుగా ఉందని, అందరికీ ఒకే విధానం అనే భావనతో యూసీసీని అమలు చేస్తే ఇప్పటికే ఉన్న అసమానతలు మరింత పెరిగిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు స్టాలిన్.

ఉమ్మడి పౌర స్మృతికి మేం వ్యతిరేకం -స్టాలిన్
X

కేంద్రం పట్టుబడుతున్నా రాష్ట్రాలు మాత్రం ససేమిరా అంటున్నాయి. ఉమ్మడి పౌర స్మృతికి వ్యతిరేకంగా తమ గళం వినిపిస్తున్నాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కూడా తమ వ్యతిరేకత తెలియజేసింది. తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా ఉమ్మడి పౌరస్మృతి ప్రతిపాదనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొంది. ఈమేరకు తమిళనాడు సీఎం స్టాలిన్, లా కమిషన్ చైర్మన్ కు లేఖ రాశారు.

యూసీసీ అమలు వల్ల కలిగే వ్యతిరేక ప్రభావాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ లా కమిషన్‌ ఛైర్మన్‌ కు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ లేఖ రాశారు. సమాజంలోని భిన్న వ్యవస్థలను ఈ ప్రక్రియ సవాలు చేయడంతోపాటు సమాజానికి తీవ్ర ముప్పుగా మారుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు స్టాలిన్.

భిన్న సంప్రదాయాలు కలిగిన సమాజంగా భారత్ కు పేరుందని చెప్పారు స్టాలిన్. ఆర్టికల్‌ 29ని అనుసరించి మైనార్టీ హక్కులను కాపాడుతూ, వాటిని గౌరవిస్తున్న భారత్‌ కు లౌకిక దేశంగా పేరుందన్నారు. జిల్లా, ప్రాంతీయ మండళ్ల ద్వారా గిరిజన ప్రాంతాల ప్రజలు వారి సంప్రదాయాలు, పద్ధతులను కాపాడుకునే వెసులుబాటు రాజ్యాంగం కల్పిస్తోందన్నారు. గిరిజన వర్గాలను యూసీసీ తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్నారు స్టాలిన్. సమాజంలో నెలకొన్న సామాజిక ఆర్థిక అసమానతలను పరిగణనలోకి తీసుకోకుండా దీన్ని అమలు చేస్తే తీవ్ర దుష్ప్రభావాలు ఉంటాయని చెప్పారు.

భారత సమాజంలోని భిన్న వర్గాల్లో అభివృద్ధి, విద్య, అవగాహన వేర్వేరుగా ఉందని, అందరికీ ఒకే విధానం అనే భావనతో యూసీసీని అమలు చేస్తే ఇప్పటికే ఉన్న అసమానతలు మరింత పెరిగిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు స్టాలిన్. సమాజంలో పలు వర్గాల మధ్య అశాంతి రగిలే ప్రమాదం కూడా ఉందని చెప్పారు.

First Published:  13 July 2023 6:00 PM IST
Next Story