ప్లస్ టూ ఫలితాల్లో 600కు 600.. - ఏ సాయం కావాలన్నా చేస్తా.. తమిళనాడు సీఎం స్టాలిన్ హామీ
అన్నామలైయార్ మిల్స్ బాలికల హయ్యర్ సెకండరీ స్కూల్‌లో విద్యనభ్యసించిన నందిని.. తమిళ్, ఇంగ్లిష్, ఎకనామిక్స్, కామర్స్, అకౌంటెన్సీ, కంప్యూటర్ అప్లికేషన్ సబ్జెక్టుల్లో వందకు వంద మార్కులు తెచ్చుకుని ఈ ఘనత సాధించింది.
తమిళనాడులో విడుదలైన ప్లస్ టూ ఫలితాల్లో 600కు 600 మార్కులు సాధించిన ఎస్.నందిని అనే విద్యార్థినిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ అభినందించారు. పై చదువుల కోసం ఆమె ఏ సాయం కావాలన్నా చేస్తానని హామీ ఇచ్చారు.
ప్లస్ టూలో సత్తా చాటిన నందిని దిండిగల్లు జిల్లా వాసి. ఆమె తండ్రి కార్పెంటర్. అన్నామలైయార్ మిల్స్ బాలికల హయ్యర్ సెకండరీ స్కూల్‌లో విద్యనభ్యసించిన నందిని.. తమిళ్, ఇంగ్లిష్, ఎకనామిక్స్, కామర్స్, అకౌంటెన్సీ, కంప్యూటర్ అప్లికేషన్ సబ్జెక్టుల్లో వందకు వంద మార్కులు తెచ్చుకుని ఈ ఘనత సాధించింది. నందిని సాధించిన ఘనత గురించి తెలుసుకున్న సీఎం ఫోన్ చేసిన ఆమెను అభినందించారు. ఆమెను, ఆమె తల్లిదండ్రులను సీఎం క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించారు.
దీంతో నందిని తన తల్లిదండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, విద్యా శాఖ అధికారులతో కలిసి మంగళవారం సీఎంను కలిసింది. ఈ సందర్భంగా టాపర్‌గా నిలిచిన నందినిని అభినందించిన సీఎం ఈ వీడియోను తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి చదువులో ప్రతిభ కనబర్చిన నందిని వంటివారు తమిళనాడుకు గౌరవ చిహ్నాలని ఆయన ఈ సందర్భంగా అభివర్ణించారు.
ఆడిటర్‌నవుతా..
సీఎం ను కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడిన నందిని.. తాను ఆడిటర్ కావాలనుకుంటున్నానని తెలిపింది. ఈ విజయం తన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అంకితమని చెప్పింది. సీఎంను కలవడం, ఆయన నుంచి బహుమతులు అందుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని నందిని సంతోషం వ్యక్తం చేసింది.