Telugu Global
National

కేరళ సవారీ.. రాష్ట్ర ప్రభుత్వ క్యాబ్ సర్వీస్..

కేరళ సవారీ అనే పేరుతో ఆన్ లైన్ క్యాబ్ సర్వీస్ సేవలను లాంఛనంగా సీఎం విజయన్ ప్రారంభించారు. దేశంలోనే ప్రభుత్వ వ్యవస్థలో నడిచే తొలి క్యాబ్ సర్వీస్ ఇది అని ఘనంగా ప్రకటించారు.

కేరళ సవారీ.. రాష్ట్ర ప్రభుత్వ క్యాబ్ సర్వీస్..
X

బస్సులు, రైళ్లు మాత్రమే ఇప్పటి వరకూ ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయని అనుకుంటున్నాం. మారుతున్న కాలానికి ప్రభుత్వాలు కూడా కొత్తగా ఆలోచించాలని చెబుతున్నారు కేరళ సీఎం పినరయి విజయన్. కేరళలో క్యాబ్ సర్వీసులను కూడా ప్రభుత్వ నిర్వహణలోకి తీసుకొచ్చారు. కేరళ సవారీ అనే పేరుతో ఆన్ లైన్ క్యాబ్ సర్వీస్ సేవలను లాంఛనంగా సీఎం విజయన్ ప్రారంభించారు. దేశంలోనే ప్రభుత్వ వ్యవస్థలో నడిచే తొలి క్యాబ్ సర్వీస్ ఇది అని ఘనంగా ప్రకటించారు. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఉపాధి హామీతోపాటు, ప్రజలకు నాణ్యమైన ప్రభుత్వ రవాణా సేవలు అందుబాటులోకి వస్తాయంటున్నారాయన.

ధర తక్కువ..

ఇతర ట్యాక్సీ సర్వీస్ లు 20 నుంచి 30 శాతం సర్వీస్ చార్జీలు వసూలు చేస్తుంటే కేరళ సవారీ మాత్రం కేవలం 8 శాతం మాత్రమే సర్వీస్ చార్జీ వసూలు చేస్తుంది. పిల్లలు, మహిళలు, వృద్ధులకు సురక్షితమైన ప్రయాణం అనే హామీతో కేరళ సవారీ మొదలైంది. ప్రైవేటు రంగంలో పోటీ వల్ల రాయితీలు ఇస్తున్నా.. పీక్ అవర్స్ అనే పేరుతో చార్జీలు బాదేస్తుంటారు. కేరళ సవారీలో అలాంటి అదనపు బాదుడు ఉండదు. 24 గంటలు ఒకటే రేటు, ఒకే భద్రత అని చెబుతున్నారు నేతలు.

కేరళ సవారీ పథకంలో చేరే ఆటో, క్యాబ్ డ్రైవర్లు ముందుగా పోలీసులనుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. తిరువనంతపురంలో ప్రస్తుతం ఈ ఆన్‌లైన్ సేవలు ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చారు. 321 ఆటోలు, 228 కార్లు ప్రస్తుతానికి కేరళ సవారీ ఆన్‌లైన్ యాప్ లో అందుబాటులో ఉన్నాయి. వీటి సంఖ్య మరింత పెంచే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రైవేట్ క్యాబ్ సర్వీసులపై ఆంక్షలు విధించడం, ప్రభుత్వాల నిరంకుశం అంటూ వారు విమర్శించడం.. ఇలాంటివన్నీ లేకుండా ప్రభుత్వమే నేరుగా ఆన్‌లైన్ క్యాబ్ సర్వీసులు నడపడం శుభపరిణామం అంటున్నారు కేరళ వాసులు. కేరళ ప్రయోగం విజయవంతం అయితే.. ఇతర రాష్ట్రాలకు కూడా ఇది అనుసరణీయం.

First Published:  18 Aug 2022 9:48 AM IST
Next Story