Telugu Global
National

నా భార్య కూడా అన్ని ప్రేమలేఖలు రాయలేదు.. కేజ్రీవాల్ సెటైర్లు..

"గవర్నర్ గారూ కాస్త శాంతించండి, మీ సూపర్ బాస్(మోదీ)ని కూడా కాస్త శాంతంగా ఉండమని చెప్పండి" అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు కేజ్రీవాల్.

నా భార్య కూడా అన్ని ప్రేమలేఖలు రాయలేదు.. కేజ్రీవాల్ సెటైర్లు..
X

ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ వీకే సక్సేనాపై కేజ్రీవాల్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఇటీవల కాలంలో ఆయన తనకు రాసే ప్రేమలేఖల సంఖ్య బాగా పెరిగిందని, తన భార్య కూడా తనకు అన్ని లేఖలు రాయలేదన్నారు కేజ్రీవాల్. ఆయన తిట్టే తిట్లు వింటుంటే, గతంలో తన భార్య తనకి అన్ని శాపనార్థాలు పెట్టినట్టు గుర్తులేదన్నారు కేజ్రీవాల్. "గవర్నర్ గారూ కాస్త శాంతించండి, మీ సూపర్ బాస్(మోదీ)ని కూడా కాస్త శాంతంగా ఉండమని చెప్పండి" అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు కేజ్రీవాల్.

రోజుకో లేఖ..

ఇటీవల కాలంలో ఢిల్లీ విషయంలో కేంద్రం పట్టు బిగించాలని చూస్తోంది. కేజ్రీవాల్ ఇతర రాష్ట్రాల్లో, ముఖ్యంగా గుజరాత్ పై ఫోకస్ పెంచాక.. బీజేపీ ఆయన్ని నిలువరించేందుకు సర్వ శక్తులు ఒడ్డుతోంది. అందులో ఒక అస్త్రం లెఫ్ట్ నెంట్ గవర్నర్. వీకే సక్సేనా తన శక్తివంచన లేకుండా కేజ్రీవాల్ ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. లిక్కర్ స్కామ్, ఉచిత కరెంటు స్కామ్ అంటూ ఆయన ఎంక్వయిరీలు వేస్తున్నారు. అక్కడితో ఆగలేదు. రోజులో లేఖ రాస్తూ వివరాలు అడుగుతున్నారు. పాలనకు సహకరించాల్సిందిపోయి, గవర్నర్ తమను చికాకు పెడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు ఆమ్ ఆద్మీ నేతలు.

ఆ లేఖల సారాంశం ఏంటంటే..?

తాను అందుకున్న లేఖలు మరీ సిల్లీగా ఉన్నాయని అంటున్నారు కేజ్రీవాల్. అక్టోబరు 2న గాంధీ జయంతి రోజున రాజ్ ఘాట్‌ కు రాకపోవడం పట్ల లెఫ్ట్ నెంట్ గవర్నర్ సక్సేనా ఇటీవల కేజ్రీవాల్‌ కు లేఖ రాశారు. కారణం చెప్పాలన్నారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం చెట్ల నరికివేతకు అనుమతులు మంజూరు చేయడంలో జాప్యం ఎందుకంటూ గతంలో మరో లేఖ రాశారు సక్సేనా. ఈ లేఖలతో ప్రయోజనం ఏముందని, తమ సమయం ఎందుకు వృథా చేస్తున్నారంటూ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరోక్షంగా తన భార్య కూడా తనకు అన్ని లేఖలు రాయలేదని, అంతగా దబాయించలేదని గవర్నర్ పై సెటైర్లు వేశారు.

First Published:  7 Oct 2022 7:20 AM IST
Next Story