బీహార్ మహా కూటమిలో లుకలుకలు
బీహార్ లోని జేడీయూ, ఆర్జేడీ కూటమి మధ్య లుకలుకలు మొదలయ్యాయి. దాంతో సాధ్యమైనంత త్వరగా ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని మహాఘట్ బంధన్ బాగస్వామ్య పక్షాలు ముఖ్యంగా వామ పక్ష పార్టీలు కోరుతున్నాయి.
బిహార్ లో సంకీర్ణ ప్రభుత్వ పాలన సాఫీగా సాగేందుకు సాధ్యమైనంత త్వరగా ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని మహాఘట్ బంధన్ బాగస్వామ్య పక్షాలు ముఖ్యంగా వామ పక్ష పార్టీలు కోరుతున్నాయి. ఇటీవల ఈ కూటమి నేతల మధ్య చెలరేగుతున్న మాటల మంటలు ప్రభుత్వ మనుగడకు అంటకుండా చూడాలని ఆ పక్షాలు కోరుతున్నాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో ఈ కమిటీ ఏర్పాటు లేకపొవడం వల్లే తరచూ కూటములు చీలిపోయాయయని ఆ పక్షాలు గుర్తు చేస్తున్నాయి. రాష్ట్రంలో జెడియు, ఆర్జెడి నేతల మధ్య విబేధాల నేపథ్యంలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడుతున్నాయి.
వచ్చే ఏడాది నాటికి నితీష్ కుమార్ స్థానంలో డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వస్తారని ఆర్‌జేడీ రాష్ట్ర చీఫ్ జగదానంద్ సింగ్ వ్యాఖ్యానించడంతో కలకలం రేగింది. సంకీర్ణ భాగస్వాముల మధ్య ఏదో జరుగుతోందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే జగదానంద కుమారుడు వ్యవసాయ శాఖ మంత్రి సుధాకర్ తన పదవికి రాజీనామా చేశారు. పైగా తన శాఖలో అధికారులంతా దొంగలేనని, తాను వారికి బాస్ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. బిజెపి సంకీర్ణం కూలిపోయి మహాగట్ బంధన్ అధికారంలోకి వచ్చినా తమ శాఖ లో బిజెపి అజెండా కొనసాగుతున్నందుకు నిరసనగా రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ఇలా ఆయన పదేపదే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేసేవారు.
కాగా, ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఈ పరిస్థితి తీవ్రతను తగ్గించేందుకు ప్రయత్నాలు చేశారు. తాను ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు తొంందర పడడం లేదని,పార్టీ లో ఎవరూ ఎటువంటి ప్రకటనలు చేయకుండా సర్క్యులర్ జారీ చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు జగదానంద్ కు చెప్పారు. సుధాకర్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత సిపిఐఎంఎల్ బృందం తేజస్వి యాదవ్ ను కలుసుకున్నది. సంకీర్ణ ప్రభుత్వం సాఫీగా సాగుతున్నతరుణంలో సింగ్ చేస్తున్నవ్యాఖ్యలు ప్రభుత్వం పై ప్రతికూల ప్రభావం పడుతుందని, వెంటనే సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పామని సిపిఐఎంఎల్ లెసిస్లేచర్ పార్టీ నేత మెహబూబ్ ఆలం చెప్పారు. సమన్వయ కమిటీతో పాటు వెంటనే కనీస ఉమ్మడి కార్యక్రమం (సిఎంపి) రూపొందించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పామన్నారు.