Telugu Global
National

ఆప్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ... ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా

సీనియర్ సభ్యుడైన‌ ఆప్‌కి చెందిన ముఖేష్ గోయల్‌ను కాదని, ప్రొటెం స్పీకర్‌గా సత్య శర్మ ప్రమాణ స్వీకారం చేయడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకిస్తోంది. అయినప్పటికీ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు, అయితే శర్మ మొదట ఎన్నికైన కౌన్సిలర్లను కాకుండా ప్రమాణస్వీకారానికి నామినేటెడ్ కౌన్సిలర్లను పిలవడంతో గందరగోళం ప్రారంభమైంది.

ఆప్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ... ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా
X

ఆప్, బీజేపీ నేతల మధ్య భారీ గందరగోళం చెలరేగడంతో ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (MCD)మేయర్ ఎన్నిక వాయిదా పడింది. సభ ప్రార‍ంభమైన కొద్ది సేపటికే ఇరు పార్టీల కౌన్సిలర్లు ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు తోసుకున్నారు.

మెజార్టీ లేకపోయినప్పటికీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ రోజు గలాబా జరిగి కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం కూడా కాకుండానే సభ వాయిదా పడింది.

నలుగురు నామినేటెడ్ కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం పూర్తయిందని, మిగిలిన వారు తదుపరి సమావేశంలో ప్రమాణ స్వీకారం చేస్తారని చెబుతూ ప్రొటెం స్పీకర్ సత్య శర్మ సభను వాయిదా వేశారు.

సీనియర్ సభ్యుడైన‌ ఆప్‌కి చెందిన ముఖేష్ గోయల్‌ను కాదని, ప్రొటెం స్పీకర్‌గా సత్య శర్మ ప్రమాణ స్వీకారం చేయడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకిస్తోంది. అయినప్పటికీ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు, అయితే శర్మ మొదట ఎన్నికైన కౌన్సిలర్లను కాకుండా ప్రమాణస్వీకారానికి నామినేటెడ్ కౌన్సిలర్లను పిలవడంతో గందరగోళం ప్రారంభమైంది.

ప్రొటెం స్పీకర్ చర్య ‘రాజ్యాంగ విరుద్ధం’ అంటూ ఆప్ ఈ నిర్ణయాన్ని ప్రతిఘటించింది.

ప్రిసైడింగ్ అధికారి సత్య శర్మ మీడియాతో మాట్లాడుతూ,

"నేను సభను శాంతి యుతంగా నడిపే ప్రయత్నం చేశాను. కాని వారు గొడవ సృష్టించారు. టేబుళ్ళపైకి ఎక్కారు. వారు శాంతియుతంగా కూర్చుంటే, నేను అందరితో ప్రమాణ స్వీకారం చేయించడానికి సిద్ధంగా ఉన్నాను"అని చెప్పారు

మరోవైపు ఆప్‌ కౌన్సిలర్‌ ప్రవీణ్‌కుమార్, బీజేపీ గూండాయిజం చేస్తోందని ఆరోపించారు. "మొదట నామినేట్ చేయబడిన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరిగింది. దానికి మేము అభ్యంతరం చెప్పాము. ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారాన్ని ముందుగా నిర్వహించాలని కోరాము. దాంతో బీజేపీకౌన్సిలర్ లు గొడవ మొదలు పెట్టారు." అని ఆయన చెప్పారు.

ఈ గందరగోళంపై బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ స్పందిస్తూ.. ‘ఆప్ ఎందుకు భయపడుతోంది... ఆప్ నైతికంగా ఓడిపోయింది.. ఆ పార్టీ కౌన్సిలర్లు వారి పార్టీకి మద్దతు ఇవ్వరని భావిస్తున్నారా? అని అన్నారు.

నిన్న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ VK సక్సేనా మేయర్ ఎన్నికకు అధ్యక్షత వహించడానికి తాత్కాలిక స్పీకర్‌గా బిజెపి నాయకుడిని నామినేట్ చేశారు. దీంతో సక్సేనా , అరవింద్ కేజ్రీవాల్ మధ్య నిన్నటి నుండి మాటల యుద్దం నడుస్తోంది.

లెఫ్టినెంట్ గవర్నర్ చర్యల పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన కేజ్రీవాల్ సక్సేనా తన ప్రభుత్వాన్నిపట్టించుకోవడం లేదని, రాజ్యాంగ విరుద్ధంగా తన‌ అధికారాన్ని ఉపయోగించారని ఆరోపించారు.

First Published:  6 Jan 2023 6:07 PM IST
Next Story