అసత్య ప్రచారాలతో ప్రజాస్వామ్య ప్రక్రియకే భంగం.. - సీజేఐ
కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ఇంటర్నెట్‌లో నకిలీ వార్తలు, వదంతులు తీవ్రస్థాయిలో వచ్చాయని జస్టిస్ చంద్రచూడ్ గుర్తుచేశారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో గోప్యత అనేది కేవలం డేటా రక్షణకు సంబంధించిన అంశం కాదని, ఇది ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. జస్టిస్ VM తార్కుండే స్మారక ఉపన్యాసంలో డిజిటల్ యుగంలో పౌర హక్కుల సమర్థన గోప్యత, నిఘా, స్వేచ్ఛా ప్రసంగం అనే అంశంపై మాట్లాడిన ఆయన నకిలీ వార్తలు పుంఖానుపుంఖాలుగా వెలువడుతుండడంతో నిజమైన సమాచారం మరుగునపడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అసత్య వార్తలతో ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలుగుతుందన్నారు.
ప్రజాస్వామ్య ఉపన్యాసాన్ని శాశ్వతంగా దెబ్బతీసే శక్తి తప్పుడు సమాచారానికి ఉందని, నకిలీ వార్తలు సమాజ పునాదుల సుస్థిరతను దెబ్బతీస్తాయని స్పష్టంచేశారు. ఇలాంటి అసత్య సమాచారం వల్ల లిబియా, ఫిలిప్పీన్స్, జర్మనీ, అమెరికా దేశాల్లో హింస చెలరేగడాన్ని నిత్యం చూస్తున్నామని చెప్పారు. సమాజంలో పునాదిగా భావించే సత్యం స్థిరత్వాన్ని దెబ్బతీయడమే నకిలీ వార్తల లక్ష్యమని సీజేఐ అభిప్రాయపడ్డారు. తప్పుడు ప్రచారాల వల్ల మతపరమైన, అప్రమత్తమైన హింసాత్మక ఘటనలు జరుగుతాయని CJI అన్నారు.
కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ఇంటర్నెట్‌లో నకిలీ వార్తలు, వదంతులు తీవ్రస్థాయిలో వచ్చాయని జస్టిస్ చంద్రచూడ్ గుర్తుచేశారు. ఇవి సరదాగా అనిపించొచ్చని... కానీ చాలా తీవ్రమైనవని అన్నారు. ఇంటర్నెట్‌లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పరిధిపై మనల్ని ఆలోచింపచేస్తున్నాయని వ్యాఖ్యానించారు. AI పరిజ్ఞానం.. అద్భుత సాంకేతిక ఆవిష్కరణే అయినప్పటికీ దానివల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం, వివక్ష వంటి సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ప్రైవేట్ యాజమాన్యంలోని సోషల్ మీడియా సంస్థలు... వాక్ స్వాతంత్ర్యానికి మధ్యవర్తుల పాత్ర పోషించడం వినాశకరమని సీజేఐ అన్నారు. ఇంటర్నెట్‌లో వాక్ స్వేచ్ఛను నియంత్రించేందుకు సరికొత్త కార్యాచరణ అవసరమని, గోప్యత, నిఘా, వాక్ స్వేచ్ఛ మధ్య సున్నితమైన సమతౌల్యాన్ని పాటించాలని హితబోధ చేశారు. హక్కులు, విధులు, బాధ్యతలను ఉల్లంఘించడం మాత్రం మంచిది కాదన్నారు.