Telugu Global
National

రాజీవ్ గాంధీ కేసులో విడుద‌లైన‌వారిని ఎక్క‌డ ఉంచాలి? వెంటాడుతున్న పౌర‌స‌త్వ స‌మస్య‌

ఈ న‌లుగురిని శ్రీ‌లంక దేశానికి పంపే స‌మాచారాన్ని ఇప్ప‌టికే విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ అధికారులు శ్రీ‌లంక రాయ‌బార కార్యాల‌యానికి అందించారు. కానీ శ్రీ‌లంక నుంచి ఎలాంటి స్పంద‌న రాక‌పోవ‌డంతో అధికారులు వారి విషయంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవాల‌నే సందిగ్ధంలో ఉన్నారు.

రాజీవ్ గాంధీ కేసులో విడుద‌లైన‌వారిని ఎక్క‌డ ఉంచాలి?  వెంటాడుతున్న పౌర‌స‌త్వ స‌మస్య‌
X

రాజీవ్ గాంధీ హత్య కేసులో విడుదలైన శ్రీలంక దేశానికి చెందిన దోషులను ఎక్క‌డ ఉంచాలి? వారిలో కొంద‌రి పౌర‌స‌త్వం శ్రీ‌లంక‌ది. వారు అక్ర‌మంగా భార‌త‌దేశంలో ప్ర‌వేశించి, ఇక్క‌డ దేశ ప్ర‌ధానిని హ‌త్య చేశారు. శిక్ష త‌ర్వాత విడుద‌లైన వారిని శ్రీ‌లంక తిరిగి త‌మ దేశంలోకి అనుమ‌తిస్తుందా? ఇలాంటి పౌర‌స‌త్వం లేని వారిని భార‌త్ త‌న భూభాగంలో బ‌త‌క‌డానికి అంగీక‌రిస్తుందా? అస‌లు ఇలాంటి స‌మ‌స్య ప‌రిష్కారానికి న్యాయ నిపుణుల చెబుతున్న ప‌రిష్కారం ఏమిటి?

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నలుగురు దోషులు శ్రీలంక పౌరులు, నవంబర్ 11న సుప్రీం కోర్టు ఆదేశాల తర్వాత జైలు నుండి విడుదలైన ఆరుగురిలో, న‌లుగురు శ్రీలంక పౌరులను ఆ దేశానికే తిరిగి పంపనున్నట్లు తమిళనాడు అధికారులు ప్ర‌క‌టించారు. కానీ శ్రీ‌లంక దేశం వారిని త‌మ దేశంలోకి అనుమ‌తించ‌డానికి విముఖంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వెల్లూరు జైలు నుంచి విడుదలైన అనంతరం నలుగురు శ్రీలంక జాతీయులను శనివారం సాయంత్రం తిరుచ్చి జిల్లాలోని ప్రత్యేక శరణార్థి శిబిరానికి తరలించినట్లు తిరుచ్చి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.

ఈ న‌లుగురిని శ్రీ‌లంక దేశానికి పంపే స‌మాచారాన్ని ఇప్ప‌టికే విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ అధికారులు శ్రీ‌లంక రాయ‌బార కార్యాల‌యానికి అందించారు. కానీ శ్రీ‌లంక నుంచి ఎలాంటి స్పంద‌న రాక‌పోవ‌డంతో అధికారులు వారి విషయంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవాల‌నే సందిగ్ధంలో ఉన్నారు. శ్రీ‌లంక నుంచి సానుకూల స్పంద‌న వ‌స్తుంద‌నే ఆశాభావంతో ఉన్న‌ట్లు భార‌త రాయ‌బార కార్యాల‌యం అధికారులు ఉన్నారు.

1991లో జ‌రిగిన మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ఏడుగురు దోషుల్లో మొదటి వ్యక్తి అయిన ఏజీ పెరరివాలన్‌ను ఆరోగ్యం సరిగా లేకపోవడం, సత్ ప్రవర్తన కారణంగా విడుదల చేయాలని మే 18న సుప్రీం కోర్టు ఆదేశించిన కొన్ని నెలల తర్వాత ఈ కేసులో మిగిలిన‌ ఆరుగురు దోషుల విడుదల జరిగింది. పెరారివాలన్, నళిని శ్రీహరన్, మురుగన్ అలియాస్ శ్రీహరన్, శంతన్, పి రవిచంద్రన్, రాబర్ట్ పయస్, ఎస్ జయకుమార్‌లు 1991లో అరెస్టై జైలు జీవితం గ‌డుపుతున్నారు. వీరిలో నళిని భర్త శ్రీహరన్‌తో సహా నలుగురు శ్రీలంక జాతీయులు ఉన్నారు.. ఈ నలుగురు శ్రీలంక జాతీయులలో, శంతన్ మాత్రమే తిరిగి లంక‌కు వెళ్లాలని కోరుకున్నారని, నళిని భర్త శ్రీహరన్, తిరుచ్చిలో ఉన్న తమ కుమార్తెతో క‌లిసి లండన్‌లో ఉండాలనుకుంటున్నారని, పయస్ నెదర్లాండ్స్ లోని తన కుటుంబం వద్దకు వెళ్లాలని , జయకుమార్ తన భార్య మరియు పిల్లలు నివసించే చెన్నైలో తిరిగి ఉండటానికి సుముఖత వ్యక్తం చేశారు.

ఈ నలుగురు ఎక్క‌డ ఉండాల‌ని నిర్ణ‌యించే కేసు సంక్లిష్టంగా ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

"ఇది భారత ప్రభుత్వం నిర్ణ‌యాధికారం, కోర్టుల చేతుల్లోనే ఉంది" అని గతంలో శ్రీలంక శరణార్థుల కేసులను వాదించిన‌ న్యాయవాది రోమియో రాయ్ చెప్పారు. వారిని శ్రీలంకకు తిరిగి పంపించకూడదనుకుంటే, అంతర్జాతీయ మానవ హక్కులు, శరణార్థులు, మానవతావాద మరియు ఆచారాల చట్టాల ప్రకారం, శరణార్థులుగా గుర్తించాల్సి ఉంటుంద‌న్నారు. "నిర్మూలన సూత్రం" ఆధారంగా వీరు భారత్‌లో తిరిగి ఉండాలని దోషుల త‌రుఫున న్యాయ‌వాదులు విజ్ఞప్తి చేయవచ్చ‌ని, అప్పుడు, వారిని భార‌త్‌లోనే ఉండ‌నిచ్చే అవ‌కాశం ఉంటుంద‌ని రాయ్ అభిప్రాయ‌ప‌డ్డారు.

రాజీవ్ హ‌త్య‌కేసులో విడుదలైన దోషులంతా, పెద్ద నేరానికే పాల్ప‌డ్డారు. కానీ 30 ఏళ్ల‌కు పైగా శిక్ష‌ను అనుభ‌వించి విడుల‌య్యారు కాబ‌ట్టి, కేంద్ర ప్ర‌భుత్వం కూడా మాన‌వ‌తా దృక్ప‌థంతో భార‌త స‌మాజంతో క‌లిసిపోవ‌డానికి అనుమ‌తించ‌వ‌చ్చ‌ని కూడా రాయ్ అన్నారు. కానీ, భద్రతా కారణాల దృష్ట్యా, విదేశీ చట్టంలోని సెక్షన్ 32 E ప్రకారం ప్రత్యేక శరణార్థి శిబిరంలో ఉండమని ప్రభుత్వం వారిని ఆదేశించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఇలాంటి ప్రత్యేక శిబిరంలో ఇప్ప‌టికే కొంద‌రు ఐరోపా పౌరులు, శ్రీ‌లంక త‌మిళులు ఉన్నారు. వీరికి భార‌త ప్ర‌భుత్వం ఎగ్జిట్ ప‌ర్మిట్ ఇచ్చినా వారు తీవ్ర నేరాల‌కు పాల్ప‌డినందున వారి మాతృ దేశాలు తిరిగి ర‌ప్పించుకునేందుకు అనుమ‌తించ‌డం లేదు.

ఇదిలా ఉండగా, నళిని సోమవారం తిరుచ్చి క్యాంపులో ఉన్న తన భర్త శ్రీహరన్ అలియాస్ మురుగన్‌ను పరామర్శించి, నలుగురిని తాము వెళ్లాలనుకుంటున్న దేశాలకు పంపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థించారు. ఈ నలుగురు నిరాహారదీక్షలో ఉన్నారనే పుకార్లను న‌ళిని ఖండించారు. తన కుమార్తెతో ఉండటానికి వీలుగా తన భర్తను వీలైనంత త్వరగా తిరుచ్చి పంపాల‌ని న‌ళిని కలెక్టర్‌ను కోరారు.

తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని 1991లో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్‌టిటిఇ) సభ్యుడు తేన్మొళి రాజరథినం, అలియాస్ ధను, ఆత్మాహుతి బాంబుగా మారి హత్య చేశారు, ఈ పేలుడులో రాజీవ్ గాంధీ, ధను సహా మొత్తం 16 మంది మృతి చెందగా, మరో 45 మంది తీవ్రంగా గాయపడ్డారు.

First Published:  15 Nov 2022 12:10 PM IST
Next Story