Telugu Global
National

పొలిటికల్ రీఎంట్రీపై చిరు ఆసక్తికర సమాధానం..

Chiranjeevi political Re-Entry: గోవాలో జరిగిన 53వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఆయన 'ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌' అవార్డు అందుకున్నారు. పొలిటికల్ రీఎంట్రీపై ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

పొలిటికల్ రీఎంట్రీపై చిరు ఆసక్తికర సమాధానం..
X

చిరంజీవి ఇటీవల కాలంలో చాలాసార్లు రాజకీయాలపై కామెంట్లు చేశారు. తన తమ్ముడు పవన్ ని ఆ స్థాయిలో చూడాలని అనుకుంటున్నానని, ఆ కల నెరవేరుతుందని కూడా ఆశాభావం వ్యక్తం చేసేవారు. తన సపోర్ట్ తమ్ముడికి ఎప్పుడూ ఉంటుందంటూ నర్మగర్భంగా వ్యాఖ్యలు చేసేవారు. కట్ చేస్తే ఈరోజు ఆయన తన మనసులో మాట బయటపెట్టారు. తానిక సినిమాలకే అంకితం అన్నారు. గోవాలో జరిగిన 53వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఆయన 'ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌' అవార్డు అందుకున్నారు. పొలిటికల్ రీఎంట్రీపై ఆసక్తికర సమాధానం ఇచ్చారు.

అప్పుడు బాధపడ్డా..

గతంలో నిర్వహించిన చలన చిత్రోత్సవంలో దక్షిణాది నటుడి ఫొటో ఒక్కటీ ఉండేది కాదని, అప్పట్లో తాను చాలా బాధపడ్డానని, ఇప్పుడు అదే వేదికపై ఈ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు చిరంజీవి. అవార్డు ఇచ్చినందుకు గాను ఇఫీ, భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్షణం కోసం దశాబ్దాల నుంచి ఎదురుచూస్తున్నానన్నారు.

ఆ విలువ తెలిసొచ్చింది..

రాజకీయంలోకి వెళ్లడం వల్ల సినిమాలకు కొన్నాళ్లు గ్యాప్‌ వచ్చిందని, అందువల్లే తనకు సినిమాల విలువేంటో అర్థమైందని చెప్పారు. ఏ రంగంలో అయినా అవినీతి ఉండొచ్చు కానీ, చిత్ర పరిశ్రమలో ఉండదన్నారు. సినిమా ఇండస్ట్రీలో ప్రతిభ ఒక్కటే కొలమానం అన చెప్పారు. రీ ఎంట్రీ సమయంలో ప్రేక్షకులు తనను ఎలా ఆదరిస్తారోననే అనుమానం ఉండేదని, కానీ ఎప్పటిలాగే తనపై ప్రేమ చూపారని, వారి ప్రేమకు తాను దాసుడిని అని చెప్పారు. జీవితాంతం తానిక చిత్ర పరిశ్రమలోనే ఉంటానన్నారు చిరంజీవి. ఇప్పుడు ప్రాంతీయ భేదాలు పోయి భారతీయ సినిమా అనే రోజు వచ్చిందని, యువహీరోలకు సైతం తాను పోటీ అయ్యానన్నారు.

First Published:  28 Nov 2022 9:04 PM IST
Next Story