Telugu Global
National

బాల్య వివాహాల కేసులో అసోం ప్రభుత్వానికి హైకోర్టు చీవాట్లు..

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. తలతిక్క వ్యవహారంగా అభివర్ణించింది. అసలు పోక్సో చట్టం కింద కేసులెందుకు పెట్టారని సూటిగా ప్రశ్నించింది.

బాల్య వివాహాల కేసులో అసోం ప్రభుత్వానికి హైకోర్టు చీవాట్లు..
X

బాల్య వివాహాల విషయంలో ఇటీవల అసోం ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయాన్ని గౌహతి హైకోర్టు తప్పుబట్టింది. బాల్యవివాహాల కేసుల్లో ఏకంగా 3వేలమంది భర్తలను అరెస్ట్ చేసి జైలుకి పంపించడం సరికాదంది. అసలీ కేసుల్లో పోక్సో చట్టాన్ని ఎందుకు ఉపయోగించారంటూ మండిపడింది. బాల్య వివాహాల్లో ఎక్కడైనా చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడ్డారనే ఆరోపణ ఉందా, అలా లేనప్పుడు ఆ చట్టాన్ని ఎందుకు ఉపయోగించారు, ఆ చట్టం కింద ఎందుకు అభియోగాలు నమోదు చేశారంటూ ప్రశ్నించింది. న్యాయమూర్తులు ఏమీ చూడరని మీరు అనుకుంటున్నారా అంటూ ప్రభుత్వం తరపు న్యాయవాదిని గద్దించింది. బాల్య వివాహాల వ్యవహారంలో 9మందికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కోర్టు, తదుపరి విచారణ వాయిదా వేసింది.

అసోంలో మాతా శిశు మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటానికి కారణం బాల్యవివాహాలే అని లెక్కగట్టింది అక్కడి బీజేపీ ప్రభుత్వం. బాల్య వివాహాలను అరికట్టాలంటే, భవిష్యత్తులో ఎవరూ వివాహ వయసులోపు పిల్లలకు పెళ్లి చేయకుండా ఉండాలంటే ఒకటే ప్రత్యామ్నాయం అని ఆలోచించారు సీఎం హిమంత బిశ్వశర్మ. బాల్యవివాహాలు చేసుకున్నవారందర్నీ అరెస్ట్ చేసి పోక్సో చట్టంకింద జైల్లో పెట్టించారు. దీంతో అసోంలో గొడవ మొదలైంది. కుటుంబ భారం మోసే భర్తలు జైలుకెళ్లడంతో భార్యలు అల్లాడిపోతున్నారు. వారి కుటుంబాలు వీధినపడ్డాయంటూ తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. కానీ సీఎం హిమంత మనసు కరగలేదు, అరెస్ట్ ల సంఖ్య పెరిగింది. దీంతో కొంతమంది గౌహతి హైకోర్టుని ఆశ్రయించారు.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. తలతిక్క వ్యవహారంగా అభివర్ణించింది. అసలు పోక్సో చట్టం కింద కేసులెందుకు పెట్టారని సూటిగా ప్రశ్నించింది. ఏ చట్టం పడితే ఆ చట్టం కింద కేసులు నమోదు చేస్తారా? అంటూ ప్రభుత్వాన్ని, పోలీసుల్ని మందలించింది. తాము ఎవరినీ ఊరికే నిర్దోషులుగా ప్రకటించట్లేదని, ఈ కేసుల్లో దర్యాప్తు చేయకుండా మిమ్మల్ని ఎవరూ అడ్డుకోవట్లేదని చెప్పింది. నిందితులను పోలీసులు కస్టడీకి కోరడంపై కూడా న్యాయస్థానం అభ్యంతరం తెలిపింది. బాల్య వివాహాలను ఎవరూ ప్రోత్సహించరు కానీ, మరీ ఇలా ఇంతమందిని అరెస్ట్ చేసి జైలులో పెట్టడం సరికాదని స్పష్టం చేసింది.

First Published:  15 Feb 2023 5:48 PM IST
Next Story