ధోనీ పేరు చెప్పి చిన్నారి కిడ్నాప్..
టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ పేరు చెప్పి ఓ మహిళను మాయ చేసిన ఓ జంట ఏడాదిన్నర పాపను కిడ్నాప్ చేశారు.
టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ పేరు చెప్పి ఓ మహిళను మాయ చేసిన ఓ జంట ఏడాదిన్నర పాపను కిడ్నాప్ చేశారు. ఈ ఘటన ధోనీ సొంత పట్టణమైన ఝార్ఖండ్‌లోని రాంచీలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పేదలకు ధోనీ డబ్బులు, ఇళ్లు ఇస్తున్నాడని బాధిత మహిళను నమ్మించి వారీ ఘాతుకానికి పాల్పడ్డారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
జిల్లాలోని జగన్నాథ్‌పూర్‌కు చెందిన మధు దేవి తన ఇద్దరు పిల్లలతో కలిసి హిన్నూలోని ఓ స్టాల్‌లో బట్టలు కొంటోంది. ఆ సమయంలో బైక్ పై వచ్చిన ఒక జంట ఆమెతో మాటలు కలిపారు.
పేదలకు ధోనీ సాయం చేస్తున్నాడని, డబ్బులు ఇస్తున్నాడని చెప్పి ఆమెను బుట్టలో వేశారు. వారు చెప్పింది పూర్తిగా నమ్మేసిన మధు తనను అక్కడికి తీసుకెళ్లవలసిందిగా కోరింది. అందుకు వారు అంగీకరించారు.
దీంతో మధు తన 8 ఏళ్ల కుమార్తెను ఓ ఫుడ్‌స్టాల్ దగ్గర ఉంచి, తన ఏడాదిన్నర కుమార్తెతో పాటూ నిందితుల బైక్ పై ఎక్కింది. వారు హర్ములోని ఓ ఎలక్ట్రిసిటీ కార్యాలయం వద్దకు మధును తీసుకెళ్లారు. డబ్బుల పంపకానికి సంబంధించి లోపల సమావేశం జరుగుతోందని చెప్పి మధు దృష్టి మరల్చారు.
ఆమే అటు చూసేలోపు ఏడాదిన్నర బాలికను తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు. ఆ షాక్ నుంచి తేరుకున్న మధు పరిగెత్తుకుంటూ వచ్చి కూతురిని పట్టుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అనంతరం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలం చుట్టూ అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు. అలాగే మధు చెబుతున్న విషయాల్లో కూడా పొంతన ఉండడం లేదని పోలీసులు చెబుతున్నారు. తొలుత ప్రభుత్వ పథకం అని చెప్పిన ఆమె ఆ తర్వాత ధోనీ పేరు చెప్పిందని పేర్కొన్నారు.