Telugu Global
National

పది రోజులు.... అయిదు తీర్పులు?!

ప‌ద‌వీ విర‌మ‌ణ‌లోగా సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్‌.వీ.ర‌మ‌ణ‌ 5 ముఖ్యమైన అంశాలపైన తీర్పులు వెలువరించవలసి ఉంది. ఆగస్టు 26 లోగా ఉండే పని దినాలు కేవలం 10. అంటే సగటున రెండు రోజుల‌కు ఒక కేసు తేల్చాల్సి ఉంటుంది.

పది రోజులు.... అయిదు తీర్పులు?!
X

వచ్చే 26వ తేదీన పదవీ విరమణ చేయనున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్. వి. రమణకు చేతినిండా పని ఉంది. మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు, పెగాసస్‌పై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక, పంజాబ్‌లో ప్రధాని పర్యటన సందర్భంగా భద్రతా లోపం, మహారాష్ట్ర వక్ఫ్‌బోర్డు వ్య‌వ‌హారం, కర్నాటక హైకోర్టు హిజాబ్ ధ‌రించడానికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు లాంటి 5 ముఖ్యమైన అంశాలపైన ఆయన తీర్పులు వెలువరించవలసి ఉంది. ఆగస్టు 26 లోగా ఉండే పని దినాలు కేవలం 10. అంటే సగటున రెండు రోజుల‌కు ఒక కేసు తేల్చాల్సి ఉంటుంది.


పౌరసత్వ సవరణ చట్టం, 370వ అధికరణం రద్దు లాంటి అతి ముఖ్యమైన అంశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ ఊసే సుప్రీం కోర్టు ఎత్తడం లేదు. న్యాయమూర్తుల పదవులు భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచడం, న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాల కొరత వంటి వాటి వల్లే పరిష్కారంకాని కేసుల సంఖ్య పెరిగిపోతోందని న్యాయమూర్తి రమణ బాహాటంగానే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. పేదలకు న్యాయం అందుబాటులో ఉండాలని కూడా అన్నారు. బహిరంగ వేదికల మీదే ప్రభుత్వాన్ని విమర్శించడానికి న్యాయమూర్తి రమణ వెనుకాడలేదు. కానీ, ఆయన పనితీరు విమర్శకు అతీతంగా ఉందా.. అన్నది అసలు ప్రశ్న.

అందరి దృష్టినీ ఆకర్షించడమే కాక కలత పెడ్తున్న భారతశిక్షా స్మృతిలోని దేశ ద్రోహ కేసులు మోపే వెసులుబాటును దుర్వినియోగం చేయడంపై మే 11వ తేదీన సుప్రీంకోర్టు కళ్లెం వేసింది. ఆ బెంచీకి నేతృత్వం వహించింది ప్రధాన న్యాయమూర్తే. రాజ్యవ్యవస్థ ప్రయోజనాలు ఎంత ముఖ్యమో పౌరహక్కులు కూడా అంతకన్నా ప్రధానమని న్యాయమూర్తి రమణ అన్నారు.

శివసేనలోని తిరుగుబాటు వర్గం పార్టీ చీలిక, విలీనం, ఫిరాయింపులు, అనర్హత మొదలైన అంశాలపై దాఖలు చేసిన పిటిషన్లు విచారణకు వచ్చినప్పుడు న్యాయమూర్తి రమణ.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తరఫు న్యాయవాది హరీష్‌సాల్వేను ప్రశ్నలతో ముంచెత్తారు. తమదే అసలైన శివసేనగా గుర్తించి అధికారిక ఎన్నికల చిహ్నాన్ని తమకే కేటాయించాలని షిండే వర్గం పెట్టుకున్నపిటిషన్‌పై నిర్ణయం తీసుకోకూడదని ఎన్.వి.రమణ నాయకత్వంలోని బెంచి ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఈ విషయమూ ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణలోగా తేల్చాల్సి ఉంది.

నిఘా వేయడానికి ఉపకరించే పెగాసస్ గూఢచార సాఫ్ట్‌వేర్‌ను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ కేసు దాఖలు అయినప్పుడు ఈ అంశాన్ని పరిశీలించడానికి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి కె. రవీంద్రన్ నేతృత్వంలో ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదిక సమర్పించడమూ పూర్తయింది. అందులో ఏముందో ఎవరికీ తెలియదు. ఈ అంశం మీద కూడా సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడాల్సి ఉంది.

ఇంటర్మీడియ‌ట్ స్థాయి కళాశాలల్లో విద్యార్థినులు హిజాబ్ వేసుకుని రావడాన్ని నిషేధిస్తూ విద్యాసంస్థలు తీసుకున్న నిర్ణయాన్ని కర్నాటక హైకోర్టు సబబేనని తేల్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో అర్జీలు దాఖలైనాయి. ఈ పిటిషన్లు విచారించడానికి బెంచీని ఏర్పాటు చేయడానికి గత మూడో తేదీన సుప్రీంకోర్టు అంగీకరించింది. ఆ విషయమూ ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణకు ముందు తేలాల్సి ఉంది.

ప్రధానమంత్రి జ‌నవరి 5న పంజాబ్‌లో పర్యటించినప్పుడు భద్రతా లోపం తలెత్తింది. ఈ అంశంపై కేసులు దాఖలైనప్పుడు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఇందూ మల్హోత్రా నాయకత్వంలో దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు జనవరిలో హామీ ఇచ్చింది. ఈ దర్యాప్తు కమిటీ ఏయే అంశాలు పరిశీలించాలో కూడా న్యాయమూర్తి రమణ నాయకత్వంలోని బెంచి ఖరారు చేసింది. కానీ ఈ అంశం అప్పటి నుంచి ఇప్పటి దాకా సుప్రీంకోర్టులో ప్రస్తావనకే రాలేదు.

ముస్లింలు దానంగా ఇచ్చిన భూములన్నీ వక్ఫ్ ప‌రిధిలోకే వస్తాయా అని పరిశీలిస్తున్న కేసులో వక్ఫ్‌బోర్డు తరఫున అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదిస్తున్నారు. ఆయనను మార్చాలన్న ప్రయత్నాలను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచి గత రెండో తేదీన తప్పు బట్టింది. కేసు విచారణలో ఉండగా న్యాయవాదిని మార్చడం ఏమిటని నిలదీసింది. ఈ వ్యవహారమూ ఆగస్టు 26వ తేదీలోగా తేలాల్సి ఉంది.

జమ్మూ-కశ్మీర్‌పై ప్ర‌త్యేక ప్రతిపత్తిని రద్దు చేయడానికి ఉపకరించే 370వ అధికరణాన్ని 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీనిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో కనీసం రెండు డజన్ల పిటిషన్లు దాఖలైనాయి. వేసవి సెలవుల తరవాత ఈ అంశాన్నివిచారిస్తామని న్యాయమూర్తి రమణ ఏప్రిల్‌లో చెప్పారు. వేసవి సెలవులు ముగిసినా విచారణ ఊసేలేదు. ఈ కేసును విచారించడానికి ఏర్పాటు అయిన బెంచిలో ఉన్న న్యాయమూర్తి ఆర్. సుభాష్‌రెడ్డి ఇటీవల పదవీ విరమణ చేశారు. అంటే మళ్లీ కొత్త బెంచి ఏర్పాటు చేయాలి. అదీ ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణలోగా సాధ్యం అవుతుందో లేదో తెలియదు.

పౌరసత్వ సవరణ చట్టాన్నిసవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లకు సంబంధించి 2019 డిసెంబర్‌లోనే సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. అంతే.. ఆ తరువాత ఆ ఊసే వినిపించలేదు.

ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణలోగా ఎన్నిఅంశాలను తేల్చగలరో చూడాలి. ఆయన మాట వాడిగా ఉంటుంది, వ్యవహార సరళి ప్రభుత్వ అనుకూలంగా ఉంటుంది అన్న అభిప్రాయం ఉంది. ప్రధాన న్యాయమూర్తి పాదముద్రలు ఎటు దారితీస్తాయో చూడాలి.

First Published:  9 Aug 2022 2:24 PM IST
Next Story