Telugu Global
National

రూ. 2వేల నోటు నల్లధనాన్ని దాచుకునే వారికి మాత్రమే సహాయపడింది.. చిదంబరం విమర్శలు

రూ. 2000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకోవాలన్న కేంద్రం చర్యపై తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం స్పందించారు. రూ. 2వేల నోటు నల్లదానాన్ని దాచుకునే వారికి తమ డబ్బును సులభంగా దాచుకోవడానికి మాత్రమే సహాయపడిందని ఆయన వ్యాఖ్యానించారు.

రూ. 2వేల నోటు నల్లధనాన్ని దాచుకునే వారికి మాత్రమే సహాయపడింది.. చిదంబరం విమర్శలు
X

నల్లధనాన్ని అంతం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ 2016లో ఉన్నట్టుండి పెద్ద నోట్లను రద్దు చేసింది. అయితే నోట్ల రద్దు నిర్ణయం సరైన ఫలితం ఇవ్వలేదు. అవినీతిపరులు తాము దాచుకున్న సొమ్మునంతా ఏదోఒక విధంగా బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. నోట్ల రద్దు వ్యవహారం సత్ఫలితాలు ఇవ్వకపోగా సాధారణ ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఇది మోడీ సర్కార్ వైఫల్యంగా ప్రతిపక్షాలు విమర్శించాయి.

పెద్ద నోట్లను రద్దు చేస్తే అవినీతి అంతం అవుతుందని ప్రకటించిన బీజేపీ సర్కార్.. ఆ తర్వాత ఏకంగా రూ. 2000 నోటును చెలామణిలోకి తెచ్చింది. ఆ నోటు చెలామణిలోకి వచ్చిన తర్వాత డబ్బు దాచుకోవడం మరింత సులభం అయ్యిందని విమర్శలు వచ్చాయి.

కాగా, రూ. 2000 నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకోవాలన్న కేంద్రం చర్యపై తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం స్పందించారు. రూ. 2వేల నోటు నల్లదానాన్ని దాచుకునే వారికి తమ డబ్బును సులభంగా దాచుకోవడానికి మాత్రమే సహాయపడిందని ఆయన వ్యాఖ్యానించారు. నల్లధనాన్ని వెలికి తీసేందుకే రూ. 2వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు బీజేపీ చేస్తున్న ప్రచారం ధ్వంసమైందన్నారు.

2016లో రూ. 2వేల నోట్లు అందుబాటులోకి రాగా, సాధారణ ప్రజల రోజువారీ చిల్లర మార్పిడికి అవి పనికి రాలేదని చిదంబరం వివరించారు. అందువల్లే ఈ నోటు ప్రవేశపెట్టినప్పటి నుంచి సాధారణ ప్రజలు ఈ నోటును వినియోగించలేదన్నారు. అయితే రూ. 2వేల నోట్లను ఎవరు దాచుకున్నారు.. వాటిని ఎందుకు ఉపయోగించారు? అనేది కేంద్రంలోని బీజేపీ నాయకులకు తెలుసని చిదంబరం విమర్శించారు.

2016లో రూ. 2వేల నోట్లను ప్రవేశపెట్టడం ఒక మూర్ఖపు చర్య అని, కనీసం ఏడు సంవత్సరాల తర్వాత అయినా ఈ మూర్ఖపు చర్యను ఉపసంహరించుకోవాలని నిర్ణయించడం పట్ల తాను సంతోషిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

First Published:  22 May 2023 10:32 PM IST
Next Story