Telugu Global
National

ఐదేళ్ళు జైల్లో మగ్గి... నిర్దోషులుగా విడుదలైన 121 మంది ఆదివాసీలు

చ‌త్తీస్ గ‌ఢ్ లో మావోయిస్టుల కేసుకు సంబంధించి 121 మంది ఆదివాసీల‌ను దంతేవాడ‌లోని ఎన్ఐఎ ప్ర‌త్యేక న్యాయ‌స్థానం నిర్దోషులుగా ప్ర‌క‌టిస్తూ విడుద‌ల చేసింది.

ఐదేళ్ళు జైల్లో మగ్గి... నిర్దోషులుగా విడుదలైన 121 మంది ఆదివాసీలు
X

చ‌త్తీస్ గ‌ఢ్ లో మావోయిస్టుల కేసుకు సంబంధించి 121 మంది ఆదివాసీల‌ను దంతేవాడ‌లోని ఎన్ఐఎ ప్ర‌త్యేక న్యాయ‌స్థానం నిర్దోషులుగా ప్ర‌క‌టిస్తూ విడుద‌ల చేసింది. 2017లో సుక్మా జిల్లాలో 25 మంది సైనికుల హ‌త్య‌, ఏడుమందికి గాయాలైన కేసులో వీరిని అరెస్టు చేశారు. ఈ దాడిని భద్రతా బలగాలపై జ‌రిగిన అత్యంత ఘోరమైన దాడుల్లో ఒకటిగా పేర్కొంటారు.

కేసు పూర్వాప‌రాలు..

ఏప్రిల్ 2017, 24న దోర్నపాల్-జగర్గుణ రహదారిపై రోడ్డు నిర్మాణ పనులకు సిఆర్‌పిఎఫ్ 74వ బెటాలియన్‌కు చెందిన సుమారు 100 మంది సిబ్బంది రక్షణ కల్పిస్తున్నారు. ఈసంద‌ర్భంలో భ‌ద్ర‌తా సిబ్బందిపై మావోయిస్టులు మెరుపుదాడి చేసినప్పుడు పోలీసులు, మావోయిస్టుల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది.

దాడి తర్వాత, పోలీసులు 121 మందిని అరెస్టు చేసి వారిపై సెక్షన్ 302, 307, 149 కోడ్, 25 (1) (1- బి ) (ఎ), సెక్ష‌న్ 27 ఆయుధాల చట్టం 1959 సెక్షన్ 3, 5 పేలుడు పదార్థాల చట్టం 1908 సిఎస్ పిఎస్ఎ సెక్షన్లు 8(1)(3)(5), చట్టవిరుద్ధ కార్యకలాపాల సెక్షన్లు 38, 39 ( నివారణ) చట్టం కింద అభియోగాలు మోపారు..

ఎఫ్ఐఆర్ న‌మోదైన నాలుగేళ్ళ త‌ర్వాత విచార‌ణ ప్రారంభం..

బుర్కపాల్, గొండపల్లి, చింతగుఫా, తల్మెట్ల, కొరైగుండం, టోంగూడ - అనే ఆరు గ్రామాలకు చెందిన 120 మందిని పోలీసులు అరెస్టు చేశారు . ఆ తర్వాత ఒక మహిళను కూడా ఈ కేసులో నిందితురాలిగా చేర్చారు. అయితే, ఎఫ్‌ఐఆర్ నమోదైన దాదాపు నాలుగేళ్ళ‌ తర్వాత ఆగస్టు 2021లో ఈ కేసు విచారణ ప్రారంభమైంది.

దాడి స‌మ‌యంలో నిందితులు అక్క‌డే ఉన్నార‌ని గానీ, వారినుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామ‌ని గానీ ప్రాసిక్యూష‌న్ నిరూపించ‌లేక‌పోయింద‌ని న్యాయ‌స్థానం పేర్కొంది. పోలీసుల తీరును త‌ప్పుబ‌ట్టింది. "ప్రాసిక్యూషన్ నమోదు చేసిన ఎటువంటి ఆధారాలు లేదా వాంగ్మూలాలు నిందితులు నక్సల్ తో సంబంధాలు ఉన్నాయ‌ని గానీ, నేరంలో పాల్గొన్నారని నిర్ధారించలేకపోయాయి. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రి నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న‌వి కాదు." అని కోర్టు పేర్కొంది.

ఆదివాసీ కుటుంబాల‌పై తీవ్ర ప్ర‌భావం..

ఈ కేసులో ఐదేళ్లపాటు జైలు జీవితం గడిపిన ఓ ఆదివాసీ మాట్లాడుతూ.. ఇంతకూ తాను చేసిన తప్పేమిటో తెలియడం లేదన‌డం వారి అమాయ‌క‌త్వానికి పోలీసుల తీరుకు అద్దం ప‌డుతుంది.

నిందితుల తరఫు వాదించిన న్యాయవాదుల్లో ఒకరైన బేలా భాటియా పోలీసుల తీరుపై ప‌లు సందేహాలు, ప్రశ్నలు సంధించారు. "మావోయిస్ట్‌లపై జరుగుతున్న పోరాటంలో ఛత్తీస్‌గఢ్ పోలీసులు సామాన్య గ్రామస్తులను కరడుగట్టిన నేరస్థులుగా, బలిపశువులుగా మారుస్తున్నారు. జైలులో ఉండి సంపాదన కోల్పోయిన వారికి ఎలాంటి పరిహారం అందుతుంది?" అంటూ బేలా భాటియా ప్ర‌శ్నించారు. బూటకపు కేసుల్లో ఆదివాసీలు ఎలా ఇరుక్కుపోయారో, న్యాయం పొందే మార్గమే శిక్షగా మారుతుందనడానికి బుర్కాపాల్ తీర్పు ప్రతీకగా నిలుస్తుందని భాటియా అన్నారు.

పోలీసులు అరెస్టు చేసిన 121 మంది నిందితుల్లో ఏడుగురు మైనర్లను ముందుగా విడుదల చేయగా, మిగిలిన‌వారిలో దొండి మంగ్లు 2 అక్టోబర్ 2021న మరణించాడు.

First Published:  17 July 2022 9:38 AM GMT
Next Story