కొరడా దెబ్బలు తిన్న ముఖ్యమంత్రి
ఈ పూజలో భాగంగా చెడును తరిమికొట్టేందుకు కొరడాతో దెబ్బలు కొడతారు. గోవర్ధన పూజలో పాల్గొని కొరడా దెబ్బలు తింటే అన్ని కష్టాలు, విఘ్నాలు తొలగిపోతాయని రాష్ట్ర ప్రజల నమ్మకం.
ముఖ్యమంత్రికి కొరడా దెబ్బలా.. అని ఆశ్చర్యపోకండి. నిజంగానే ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కొరడా దెబ్బలు తిన్నారు. మామూలుగా తప్పు చేసిన వారు కొరడా దెబ్బలు తింటుంటారు. అయితే ఆయన ఏ తప్పు చేయలేదు. తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని పాటించేందుకు కొరడా దెబ్బలు తిన్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో దీపావళి మరుసటి రోజు గోవర్ధన పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ పూజలో భాగంగా చెడును తరిమికొట్టేందుకు కొరడాతో దెబ్బలు కొడతారు. గోవర్ధన పూజలో పాల్గొని కొరడా దెబ్బలు తింటే అన్ని కష్టాలు, విఘ్నాలు తొలగిపోతాయని రాష్ట్ర ప్రజల నమ్మకం. ఏటా ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కూడా దుర్గ్ జిల్లాలోని జజన్ గిరి, కుమ్హారి గ్రామాల్లో జరిగే గోవర్ధన పూజల్లో పాల్గొంటూ ఉంటారు. ఇవాళ ఆయన జజన్ గిరిలో జరిగిన గోవర్ధన పూజలో పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రజలకు అన్ని విఘ్నాలు తొలగిపోవాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి కొరడా దెబ్బలు తిన్నారు. ఆలయంలో గోవర్ధన పూజ నిర్వహిస్తున్న చోట సీఎం చేయి చాచి నిలబడగా ఒక వ్యక్తి కొరడా తీసుకొని ఆయన మణికట్టుపై ఐదు సార్లు కొట్టారు. అనంతరం ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కొరడాతో కొట్టిన వ్యక్తికి నమస్కరించి అక్కడి నుంచి వెనుదిరిగారు. ముఖ్యమంత్రి కొరడా దెబ్బలు తిన్న వీడియోను CMO ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా అది ప్రస్తుతం వైరల్ గా మారింది.