Telugu Global
National

ఓ ఛానల్ ఎడిటర్ చేసిన పనికి మ్యారేజ్ రిసప్షన్ రద్దయిపోయింది

ముంబై కి చెందిన ఇమ్రాన్, దివ్య ప్రేమించుకొని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ పెళ్ళికి ఇరు కుటుంబాలు కూడా సమ్మతించాయి. పెళ్ళి తర్వాత ముంబై శివార్లలోని వసాయ్, ఆనంద్ నగర్లో ఓ ఫంక్షన్ హాల్ లో ఈ నెల 20న రిసప్షన్ ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే...

ఓ ఛానల్ ఎడిటర్ చేసిన పనికి మ్యారేజ్ రిసప్షన్ రద్దయిపోయింది
X

హిందుత్వ వాది సుదర్శన్ న్యూస్ ఎడిటర్-ఇన్-చీఫ్ సురేశ్ చవాన్కే కావాలని, విద్వేషంతో చేసిన ఒక పని వల్ల ఓ నూతన జంట తమ రెసెప్షన్ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఓ ముస్లిం యువకుడు, మరో హిందూ యువతి పెళ్ళి చేసుకొని రిసెప్షన్ కోసం ప్లాన్ చేసుకోగా వీరి పెళ్ళిని ఢిల్లీ యువతి శ్రద్ధా వాకర్ హత్యతో ముడి పెట్టి ట్విట్టర్ లో సురేశ్ చవాన్కే చేసిన ప్రచారంతో ఆ జంట, వారి కుటుంబాలు భయపడిపోయారు. వెంటనే రిసెప్షన్ కార్యక్రమాన్ని రద్దుచేసుకున్నారు.

ముంబై కి చెందిన ఇమ్రాన్, దివ్య ప్రేమించుకొని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ పెళ్ళికి ఇరు కుటుంబాలు కూడా సమ్మతించాయి. పెళ్ళి తర్వాత ముంబై శివార్లలోని వసాయ్, ఆనంద్ నగర్లో ఓ ఫంక్షన్ హాల్ లో ఈ నెల 20న రిసప్షన్ ఏర్పాట్లు చేసుకున్నారు.

ఆ రిసప్షన్ కు సంబంధించిన ఆహ్వాన పత్రికను సంపాదించిన సురేశ్ చవాన్కే నవంబర్ 18, శుక్రవారం, ఆ వివాహ రిసెప్షన్ ఆహ్వాన పత్రికను ట్వీట్ చేశారు. ఇమ్రాన్, దివ్య వసాయ్‌లో వివాహం చేసుకోబోతున్నారని వ్యాఖ్యానించారు. పైగా, "ఢిల్లీలో శ్రద్దా వాకర్ ను హత్య చేసిన అఫ్తాబ్ కూడా వసాయికి చెందినవాడే, అతను శ్రద్ధను 35 ముక్కలుగా నరికాడు. ఇంత హృదయ విదారకమైన నేరం జరిగిన తర్వాత కూడా, అక్కడ ఇలాంటి మతాంతర వివాహం ఎలా జరుగుతుంది?'' అని తన ట్వీట్ లో కామెంట్ చేశారు.

ఆ ట్వీట్ కొన్ని గంటల్లోనే వైరల్ అయ్యింది వేల మంది దాన్ని రీ ట్వీట్ చేశారు. అందులో ఎక్కువగా హిందుత్వ గుంపులు ఉండటం గమనార్హం. ఈ వార్త రాసే సమయానికి సురేశ్ పోస్ట్ చేసిన ట్వీట్ కు 10 వేలకు పైగా లైక్ లు 4700 రీట్వీట్ లు వచ్చాయి.


ఈ హడావుడి చూసి ఆ నవ జంట, వారి కుటుంబాలు భయపడిపోయారు. వెంటనే తమ మ్యారేజ్ రిసప్షన్ ను రద్దు చేసుకున్నారు.

దీనిపై స్పందించి ఓ సీనియర్ పోలీసు అధికారి, ''వారిద్దరి పెళ్ళితో కానీ, రిసప్షన్ తో కానీ మాకెలాంటి సమస్యలేదు. వాళ్ళిద్దరూ మేజర్స్ , పైగా ఇరు కుటుంబాలు ఈ పెళ్ళికి అంగీకరించాయి '' అన్నారు.

తాము వధూవరులిద్దరితో మాట్లాడామని వారిద్దరూ ఇష్టంతోనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారని వాసాయ్ లోనీ మరో పోలీసు అధికారి ఎస్ పాటిల్ చెప్పారు.

రిసప్షన్ కార్యక్రమం రద్దయిన తర్వాత కొద్ది సేపటి క్రితం ఆనందంతో సురేశ్ చవాన్కే మరో ట్వీట్ చేశాడు. అక్కడ కార్యక్రమం రద్దయిపోయింది అని కామెంట్ చేశాడు.

సురేశ్ చవాన్కే కు వివాదాలు రేకెత్తించడం కొత్త కాదు. అతను ముస్లింలకు వ్యతిరేకంగా మతపరమైన ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి కాదు.

ప్రతీసారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సురేశ్ చవాన్కే కు ముస్లింలు, హిందువులు పెళ్ళి చేసుకోవడంలో వ్యతిరేకత లేదు. ముస్లిం అబ్బాయి. హిందూ అమ్మాయి పెళ్ళి చేసుకోవడంలోనే ఆయనకు సమస్య.

ఈ ఏడాది సెప్టెంబర్ 4న ఢిల్లీలోని బదర్‌పూర్‌లో జరిగిన ఓ ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ,"మీరు ( ముస్లిం అమ్మాయిలు)హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే, ఆ అబ్బాయి మీకు అన్యాయం చేయడు. మీరు హిందూ అబ్బాయిలను వివాహం చేసుకుని హిందూ మతంలోకి మారితే, మీరు తలాక్ (విడాకులు) సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని నేను మీకు హామీ ఇస్తున్నాను. మీరు బేబీ మేకింగ్ ఫ్యాక్టరీగా మారాల్సిన అవసరం లేదు లేదా 40-50 మంది పిల్లలకు జన్మనివ్వాల్సిన అవసరం లేదు.'' అన్నాడు.

చవాన్కే తన ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించి అతనిపై అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయి, కానీ ఆ కేసులేవీ ఆయనను ద్వేషపూరిత ప్రసంగాలు చేయకుండా ఆపలేదు.

4 మే 2022న, డిసెంబరు 2021లో ఢిల్లీలో జరిగిన కార్యక్రమాల్లో భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మారుస్తానని ప్రమాణం చేసినందుకు ఢిల్లీ పోలీసులు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

3 ఏప్రిల్ 2022న ఢిల్లీలోని బురారీలో జరిగిన హిందూ మహాపంచాయత్ కార్యక్రమంలో ముస్లిం వ్యతిరేక ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు అతని పేరు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

గతంలో, చవాన్కే తన ఛానెల్ సుదర్శన్ న్యూస్‌లో 'UPSC జిహాద్' అంటూ ఉద్యోగ జీహాద్ అంటూ ముస్లింలపై విషం కక్కారు.

15 సెప్టెంబర్ 2020న, సుదర్శన్ న్యూస్ 'UPSC జిహాద్' (లేదా ఇలాంటి కంటెంట్) గురించి కానీ, ఎడిటర్ సురేష్ చవాన్కే ఈ జీహాదీ షో యొక్క ఇతర ఎపిసోడ్‌లను కానీ ప్రసారం చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆయన చేసిన ప్రసారాలు సమాజాన్ని కించపరచడం కోస‌మేనని కోర్టుకు కనిపిస్తుందని, ఆయన చేసిన అనేక ప్రకటనలు పూర్తి తప్పుగా ఉన్నాయని సుప్రీం కోర్టు పేర్కొంది. .

ఇలాంటివి ఎన్ని జరిగినా ఆయన మత విద్వేషాలు వ్యాప్తి చేయడాన్ని ఆపలేదు. చివరకు ఓ జంట పెళ్ళి చేసుకొని తమ సంతోషాన్ని బంధువులతో, స్నేహితులతో పంచుకుందామనుకుంటే ఆ కార్యక్రమాన్ని ఆపిందాకా నిద్రపోలేదాయన. పైగా మనసు నిండా విద్వేషం, మనుషుల పట్ల‌ ద్వేషం నింపుకొని సమాజంలో ఓ భయానక వాతావరణాన్ని సృష్టించి తాము అనుకున్నది ఏమైనా చేయగలం, తమకు నచ్చనిదాన్ని దేన్నైనా ఆపగలం, తమకు నచ్చినదాన్ని ఎవరితోనైనా బలవంతంగా చేయించగలమనే ఓ సందేశాన్ని సమాజ‍లోకి పంపుతున్నారు. ఈ సమాజం ఇలా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవాల్సిందేనా ?

First Published:  19 Nov 2022 3:51 PM IST
Next Story